సల్మాన్‌తో పైడిపల్లికి ఇబ్బంది?
Vamsi Paidipally-Salman Khanబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న వార్ యాక్షన్ డ్రామా `మాతృభూమి` విడుదల మరోసారి ఆలస్యం కావడం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లికి కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతుందా? .. వాస్తవానికి సల్మాన్ మాతృభూమి సినిమా షూటింగ్ పూర్తయినా భారత్-చైనా సరిహద్దుల మధ్య ప్రస్తుత దౌత్య సంబంధాల నేపథ్యంలో ప్రభుత్వం నుండి సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో ఈ చిత్రాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో 2027కి వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
అయితే అప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సల్మాన్ ఖాన్ చేస్తున్న సినిమా కూడా రెడీ అయిపోతుంది. దీనివల్ల 2027లో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు బ్యాక్-టు-బ్యాక్ `డబుల్ ధమాకా` ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నా.. సల్మాన్ తన సొంత డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `మాతృభూమి` ప్రమోషన్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో వంశీ పైడిపల్లి టీమ్‌కు డేట్ల సర్దుబాటు విషయంలో సడెన్ ట్రబుల్స్ తప్పేలా లేవు.
దేశభక్తి, గల్వాన్ లోయ ఘర్షణల వంటి అత్యంత సున్నితమైన అంశాలతో సినిమాలు తీస్తే సెన్సార్ చిక్కులు, పొలిటికల్ ఒత్తిళ్లు ఎలా ఉంటాయో `మాతృభూమి` ఆలస్యం ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతోనే ఈ జాప్యం జరుగుతోందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తున్నా ఈ డేట్ల క్లాష్ - ప్రమోషన్స్ ప్లానింగ్‌పై సల్మాన్ ఖాన్ అధికారిక బృందం నుండి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ 2027 ప్రారంభంలోనే `మాతృభూమి` విడుదలైతే.. వంశీ పైడిపల్లి-దిల్ రాజు ప్రాజెక్ట్ తదుపరి నెలల్లో రిలీజ్ అయ్యేలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకోవాలి.
ఈ అనివార్య వాయిదా సల్మాన్ అభిమానులను నిరాశపరుస్తోంది. అదే సమయంలో పక్కా షెడ్యూల్స్‌తో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్న పైడిపల్లి టీమ్‌కు కూడా ఇబ్బందిగా మారుతుందని అంచనా.







































