బయోపిక్స్ లో దాదా మరో ధోనీ అవుతాడా?
Sourav Ganguly follows Sachin and Dhoni into India's sports biopic clubభారతీయ చలనచిత్ర పరిశ్రమలో క్రికెటర్ల జీవిత కథలపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు కపిల్ దేవ్, ఎం.ఎస్. ధోనీ, సచిన్ టెండూల్కర్, మితాలీ రాజ్ , జులన్ గోస్వామి వంటి దిగ్గజ క్రీడాకారుల బయోపిక్‌లు వెండితెరపైకి వచ్చాయి. అయితే `ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ` సాధించిన అద్భుతమైన విజయాన్ని మరే ఇతర క్రికెట్ బయోపిక్ అందుకోలేకపోయిందనేది వాస్తవం. ప్రేక్షకులు క్రికెట్ స్కోర్లు లేదా మ్యాచ్‌లను మాత్రమే కాకుండా తెర వెనుక ఉన్న సంఘర్షణను .. భావోద్వేగాలను చూడాలని కోరుకుంటారు.
ప్రస్తుతం అందరి దృష్టి సౌరవ్ గంగూలీ బయోపిక్ పైనే ఉంది. `దాదా` అని ముద్దుగా పిలుచుకునే గంగూలీ జీవితంలో వివాదాలు, పట్టుదల , భారత జట్టును తీర్చిదిద్దిన నాయకత్వ పటిమ వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తారు? ధోనీ చిత్రంలో ఉన్నట్టుగా, గంగూలీ జీవితంలోని మలుపులను ఎంత వరకు సహజంగా చూపిస్తారనేదే సినిమా విజయాన్ని నిర్ణయించనుంది.
గంగూలీ చిత్రం మరొక `ధోనీ` స్థాయి సక్సెస్ అందుకోవాలంటే కేవలం అతని గణాంకాలపైనే ఆధారపడకూడదు. దాదా పాత్రలోని తీవ్రతను, భారత క్రికెట్ జట్టులో అతను తెచ్చిన మార్పులను భావోద్వేగపూరితంగా ఆవిష్కరించడం కీలకం. ధోనీ బయోపిక్ ప్రేక్షకుల మదిని గెలవడానికి ప్రధాన కారణం అందులోని పాత్రల ప్రయాణం.
గంగూలీ బయోపిక్ కూడా ప్రేక్షకులను ఆ స్థాయిలో కనెక్ట్ చేస్తేనే బాక్సాఫీస్ వద్ద ధోనీని మించే అవకాశం ఉంటుంది. ఇందులో దాదా పాత్రను రాజ్ కుమార్ రావ్ పోషిస్తుండగా విక్రమ్ ఆదిత్య మోత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.







































