బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ `కాంతార` సినిమాలోని దైవాన్ని అనుకరిస్తూ చేసిన మిమిక్రీ వివాదం చివరకు ఎండ్ కాబోతోంది. గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో చాముండేశ్వరి అమ్మవారిని ఉద్దేశించి రణవీర్ చేసిన వ్యాఖ్యలు.. మిమిక్రీ అనుకరణలు భక్తుల మనోభావాలను గాయపరిచాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టులో శనివారం జరిగిన విచారణలో.. రణవీర్ సింగ్ బేషరతు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ సమర్పించారు. మైసూర్‌లోని చాముండి హిల్స్‌కు స్వయంగా వెళ్లి అమ్మవారి పాదాల వద్ద క్షమాపణ కోరతానని ఆయన హామీ ఇచ్చారు. దీనిని ఆమోదించిన జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం.. నాలుగు వారాల వ్యవధిలో ఆలయాన్ని సందర్శించాలని సూచిస్తూ ఈ వివాదాన్ని ముగించే దిశగా అడుగులు వేసింది.
ప్రజా జీవితంలో ఉన్న నటులు మతపరమైన విశ్వాసాల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని.. భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఇతరుల నమ్మకాలను కించపరచడం కాదని ఈ సందర్భంగా కోర్టు హితవు పలికింది. రణవీర్ సింగ్ తరపు న్యాయవాదులు భద్రతా కారణాల దృష్ట్యా పర్యటన తేదీని గోప్యంగా ఉంచినా కర్ణాటక పోలీసులు తగిన భద్రత కల్పిస్తారని ఫిర్యాదుదారు ప్రశాంత్ మెతల్ ధీమా వ్యక్తం చేశారు.
నటుడు స్వయంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరడంతో ఈ కేసును ఇక్కడితో ముగించడం సరైనదని ఫిర్యాదుదారు కూడా అభిప్రాయపడ్డారు. దీనివల్ల రణవీర్ చుట్టూ ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగిపోవడమే కాకుండా ప్రజల్లో ఉన్న ఆగ్రహం కూడా చల్లారే అవకాశం ఉంది.




సాయి పల్లవి ప్లేస్ లో రుక్మిణి వసంత్
Loading..