డైరెక్టర్ గా షాక్ ఇచ్చిన చివరి చిత్రం!
Hai Jawani Toh Ishq Hona Hai box office performanceబాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రాల దర్శకుడు డేవిడ్ ధావన్- ఆయన కుమారుడు వరుణ్ ధావన్ కాంబినేషన్‌లో రూపొందిన `హై జవానీ తో ఇష్క్ హోనా హై` బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో బోణీ కొట్టలేకపోయింది. జూన్ 5న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన త్రికోణ ప్రేమకథా చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నప్పటికీ విడుదలకు ముందు వచ్చిన మిశ్రమ సమీక్షలు సాదాసీదా బజ్ కారణంగా మొదటి రోజు వసూళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
వరుణ్ ధావన్ కెరీర్‌లోనే అత్యల్ప ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో ఇదొకటిగా నిలవడం గమనార్హం. ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కేవలం 7.50 కోట్ల నికర వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. వరుణ్ ధావన్ గత సోలో చిత్రాలైన `సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి (10 కోట్లు), `బేబీ జాన్ (11.25 కోట్లు) లతో పోల్చితే ఈ నంబర్స్ చాలా తక్కువ. గడిచిన 14 ఏళ్ల వరుణ్ ధావన్ సినీ ప్రయాణంలో `అక్టోబర్`, `మై తేరా హీరో` మినహా మరే చిత్రం కూడా ఇంతటి బలహీనమైన ఓపెనింగ్‌ను నమోదు చేయలేదు.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే? ఈ సినిమా సాధించిన మొదటి రోజు కలెక్షన్లు ఆయన డెబ్యూ మూవీ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` వసూళ్ల శ్రేణిలోనే ఉండటం పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. యాక్షన్ లేని ఒక సాధారణ రొమాంటిక్ కామెడీ సినిమా అయినప్పటికీ మేకర్స్ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా దాదాపు 2500 స్క్రీన్లలో భారీగా విడుదల చేశారు. ఇంత పెద్ద ఎత్తున విడుదల చేసినా? థియేటర్లలో ఆక్యుపెన్సీ చాలా పేలవంగా నమోదైంది. శుక్రవారం ఉదయం ఆటలకు కేవలం 9శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు కాగా రాత్రి ఆటల సమయానికి అది 30శాతం కి చేరుకుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా మొదటి రోజు సగటున 20శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీతోనే ఈ చిత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఇదే సినిమాతో దర్శకుడిగా డేవిద్ ధావన్ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే.







































