నెల‌లో రెండుసార్లు జీతాలిచ్చే విధానం!

Bi-monthly salary in India

భారతీయ వ్యాపార రంగంలో ఎప్పటినుంచో స్థిరపడిపోయిన ప్రతినెలా ఒక‌టో వారంలో జీతాలు ఇచ్చే పద్ధతిపై ప్రముఖ ఇన్వెస్టర్ అనుపమ్ మిట్టల్ సరికొత్త ఐడియాను షేర్ చేసారు. బ్రిటీష్ కాలం నాటి పాత వేతన పంపిణీ విధానాన్ని పక్కనపెట్టి, ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ప్రతినెలా 15, 30 తేదీలలో విడతల వారీగా రెండుసార్లు నగదును అందించాలని ఆయన కోరారు.

ఒకేసారి కాకుండా 15 రోజుల వ్యవధిలోనే అకౌంట్‌లో డబ్బులు జమకావడం వల్ల సగటు జీవులపై నెలవారీ ఆర్థిక ఒత్తిడి, అప్పుల భారం చాలావరకు తగ్గుతాయని మిట్ట‌ల్ బలంగా చెబుతున్నారు. ఐటీ - కార్పొరేట్ రంగాల ఉద్యోగుల వ్యక్తిగత బడ్జెట్ నిర్వహణను..అలాగే కంపెనీల లిక్విడిటీ ప్లానింగ్‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నెల‌లో రెండుసార్లు వేతన విధానం అటు శ్రామిక వర్గానికి, ఇటు యాజమాన్యాలకు సమతుల్యమైన ప్రయోజనాలను చేకూరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నెల మొత్తంలో వచ్చే చిన్నచిన్న అత్యవసర ఖర్చులు లేదా మెడికల్ అవసరాల కోసం ఏకంగా 30 రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. ప్రతి రెండు వారాలకోసారి చేతికి నగదు అందడం వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

అయితే ఈ ప్రతిపాదనకు సోషల్ మీడియాలో ఐటీ ప్రొఫెషనల్స్ నుండి భారీగా మద్దతు లభిస్తున్నా.. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) యాజమాన్యాలు మాత్రం దీనివల్ల ప్రతి 15 రోజులకు ఒకసారి పేరోల్ అకౌంటింగ్ నిర్వహించడం - పన్నుల లెక్కలు చూడటం అదనపు పరిపాలనా భారంగా మారుతుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం మారిన టెక్నాల‌జీ, ఏఐతో అకౌంటింగ్ వ‌ల్ల నెల‌లో రెండుసార్లు జీతాలిచ్చే విధానం క‌ష్ట‌మేమీ కాద‌ని మిట్ట‌ల్ అంటున్నారు. షాదీ డాట్ కాం వంటి విజ‌య‌వంత‌మైన వ్యాపారాల్ని మిట్ట‌ల్ న‌డిపిస్తున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా కార్య‌క్ర‌మం ద్వారా 38 కోట్ల వ‌ర‌కూ వివిధ స్టార్ట‌ప్ ల‌పై పెట్టుబ‌డులు పెట్టిన అనుభ‌వం మిట్ట‌ల్ కి ఉంది.
 

Mittal's twice-a-month salary pitch sparks feasibility debate