ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Lawrence's Daughter to Debut as Director

మెగాఫోన్ పట్టనున్న లారెన్స్ వారసురాలు!

Lawrence's Daughter to Debut as DirectorLawrence's Daughter to Debut as Director

టాలీవుడ్‌- కోలీవుడ్‌లోనూ నృత్య దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా , సామాజిక సేవకుడిగా అశేష ప్రేక్షకాదరణ పొందిన వర్సటైల్ పర్సనాలిటీ రాఘవ లారెన్స్. `ముని` నుండి `కాంచన` సిరీస్ వరకు హారర్ థ్రిల్లర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన లారెన్స్ కుటుంబం నుండి ఇప్పుడు మరొక వారసురాలు సినీ రంగ ప్రవేశానికి సిద్ధమైంది. చాలా మంది స్టార్ కిడ్స్ లాగా వెండితెరపై నటిగా అడుగుపెట్టకుండా లారెన్స్ కుమార్తె రాఘవి ఎవరూ ఊహించని విధంగా దర్శకురాలి పాత్రను ఎంచుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో  హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా దర్శకులు కావాలనుకునే వారు పరిశ్రమలోని ప్రముఖ దర్శకుల వద్ద కొన్నేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి మెళకువలు నేర్చుకుంటారు. కానీ రాఘవి ఆ పాత పద్ధతికి స్వస్తి పలికి నేరుగా అంతర్జాతీయ స్థాయిలో చలనచిత్ర మేకింగ్ , డైరెక్షన్ టెక్నాలజీపై ప్రత్యేక కోర్సులు పూర్తి చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్‌తో బరిలోకి దిగుతోంది. చిన్నతనం నుంచే సినిమా స్క్రిప్ట్ రైటింగ్ , టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో ఆమె స్వయంగా వైవిధ్యమైన భారీ బడ్జెట్ కథను సిద్ధం చేసుకుంది. కూతురి ఆశయానికి తండ్రి లారెన్స్ కూడా పూర్తి మద్దతు ప్రకటించి  డెబ్యూ ప్రాజెక్ట్‌ను స్వయంగా నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారుట‌.

ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లొకేషన్ల వేట  - ఫైనల్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిసింది. లారెన్స్ `బెంజ్`, `కాలభైరవ` వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ  కుమార్తెను టాలెంటెడ్ డైరెక్టర్‌గా పరిచయం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న తరుణంలో రాఘవి తీసుకున్న సంచలన నిర్ణయం ఆమెకు ఎలాంటి గుర్తింపును తెచ్చిపెడుతుందో చూడాలి. అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్, నటీనటులు ,సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
 

Raghava Lawrence's Daughter Raghavi to Debut as Director