నటుడు స్టార్‌గా ఎదిగే క్రమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, ఇమేజ్‌ను సొంతం చేసుకుంటాడు. అయితే వెండితెరపై సామాన్యుడి పాత్రను పోషించేటప్పుడు ఈ స్టార్ ఇమేజ్ ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రేక్షకులు థియేటర్‌లోకి రాగానే ఒక పక్కింటి అబ్బాయినో లేదా కష్టాల్లో ఉన్న సామాన్యుడినో చూడాలనుకుంటారు. కానీ సదరు నటుడికి ఉన్న లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ వల్ల ఆ పాత్రలోని సహజత్వం కంటే నటుడి వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది. దీనివల్ల పాత్ర పడే ఆవేదన ప్రేక్షకుడికి నేరుగా కనెక్ట్ అవ్వకుండా కేవలం ఒక స్టార్ నటిస్తున్నాడనే భావన మాత్రమే మిగిలిపోతుంది.
మరో ప్రధానమైన మైనస్ ఏమిటంటే? స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల కోసం దర్శకులు కథలో బలవంతంగా కొన్ని మార్పులు చేయాల్సి రావడం. ఒక సామాన్యుడి కథలో కూడా మాస్ ఆడియన్స్ కోసం అనవసరమైన ఫైట్లు, పంచ్ డైలాగులు లేదా గ్లామరస్ పాటలు చేర్చడం వల్ల ఆ కథ తన ఆత్మను కోల్పోతుంది. సామాన్యుడు అంటే సమస్యలతో పోరాడేవాడు. కానీ స్టార్ హీరో ఆ పాత్రలో ఉన్నప్పుడు సమస్యలను చిటికెలో పరిష్కరించే సూపర్ హీరోలా మారిపోతాడు. ఈ స్టార్‌డమ్ ప్రభావం వల్ల కథలోని లాజిక్ దెబ్బతినడమే కాదు. వాస్తవికతకు సినిమా చాలా దూరమవుతుంది. ఇది ఆ పాత్ర యొక్క గాఢతను తగ్గించి సినిమాను కమర్షియల్ ప్యాకేజీగా మార్చేస్తుంది.
అంతేకాదు స్టార్ ఇమేజ్ వల్ల ప్రేక్షకుల అంచనాలు కూడా ఒక పరిమితిని విధిస్తాయి. తమ హీరోని సాదాసీదాగా చూస్తే అభిమానులు నిరాశ చెందుతారనే భయంతో నటులు కూడా తమ బాడీ లాంగ్వేజ్‌ను , లుక్‌ను పూర్తిగా మార్చుకోవడానికి వెనుకాడతారు. ఫలితంగా నటుడు ఎంత గొప్పగా నటించినా అతని సూపర్ స్టార్ బిరుదు ఆ పాత్రను కప్పేస్తుంది. నటన కంటే ఇమేజ్ డామినేట్ చేసినప్పుడు ఆ సినిమా ఒక మంచి ప్రయోగంగా మిగిలి పోతుందే తప్ప ఆ పాత్రకు లభించాల్సిన పూర్తి స్థాయి గుర్తింపు లభించదు. అందుకే స్టార్ హోదాలో ఉండి సామాన్యుడిగా మెప్పించడం అనేది కత్తిమీద సామే.




జీరో హైప్ తో బ్యాడ్ బాయ్ కార్తీక్
Loading..