యూట్యూబర్, నా అన్వేషణ అన్వేష్‌పై హిందూ సంఘాలు ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. భారతదేశాన్ని, హిందూయిజాన్ని ద్వేషిస్తూ అతడు ప్రచారం సాగిస్తున్నాడని, అసభ్యతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడని కూడా విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. అతడిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి మాధవీలత విరుచుకుపడ్డారు. అతడు ఆడవారిపై అసభ్యతను ప్రచారం చేస్తున్నాడని, తప్పుడు పదజాలంతో, తప్పుడు నడవడిక, సలహాలతో యువతరాన్ని చెడగొడుతున్నాడని కూడా మాధవీలత ఆరోపించారు.
అతడు హిందూ వ్యతిరేక నినాదాలు చేసాడంటూ, నటి, భాజపా నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అతడిని విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని విశ్వ హిందూ పరిషత్ (వీ.హెచ్.పి) ప్రతినిధులు విశాఖ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో అన్వేష్ వ్యాఖ్యలపై ప్రముఖ అవధాని, ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు పరోక్షంగా స్పందించారు. అతడి వైఖరిని, వ్యక్తిత్వాన్ని ఆయన తప్పు పట్టారు.
అన్వేష్ ని ఆయన `నేరస్తుడు` అంటూ దుయ్యబట్టారు. ``నేరస్థుడికి శిక్ష కంటే సమాజం ఛీత్కరించుకున్నప్పుడే మార్పు వస్తుంది`` అని వ్యాఖ్యానించారు. ఏ మచ్చ లేని వారిపై బురద జల్లడం సరికాదని, తన అభిమానులు ఇలాంటి వాటిని సహించరని, తనకు అన్నివేళలా వారు మద్ధతుగా నిలిచారని తెలిపారు. ధర్మానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. అసభ్యతపై సమాజం గళం ఎత్తాలని ఆయన పిలుపునిచ్చారు. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత ఈ గొడవంతా మొదలైంది. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూట్యూబర్ అన్వేష్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు ఆయన ఇన్‌స్టా- యూట్యూబ్ ఖాతాలను అన్‌ఫాలో చేస్తున్నారు.
పద్మశ్రీ గ్రహీత.. పండితుడు..
హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో గరికపాటి వారు చేస్తున్న కృషికి ఇప్పటికే చాలా గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రవచనాలకు అభిమానులు ఉన్నారు. గరికపాటి నరసింహారావు ఆయన పూర్తి పేరు. గరికపాటి సాహితీవేత్త, అవధాని. 1996లో ఆయన కాకినాడలో 21 రోజుల పాటు 1116 మంది పృచ్ఛకులతో అవధానం చేశారు. ఆయన ధార్మిక సంస్కృతి, జీవన విధానం ఆధారంగా వ్యక్తిత్వ వికాసంపై ఉపన్యాసాలతో గొప్ప అభిమానం సంపాదించుకున్నారు. ఆయన భగవద్గీత, రామాయణం,మహాభారతం వంటి ప్రాచీన హిందూ గ్రంథాలపై ప్రవచనాలు ఇస్తూ ఎస్వీబీసీ, భక్తి టీవీ సహా ప్రముఖతెలుగు టీవీ ఛానెళ్లలో క్రమం తప్పకుండా కనిపిస్తారు. 2022లో భారత ప్రభుత్వం ఆయనకు భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.




దురంధర్‌పై ఆర్జీవీ ప్రేమ వెనక
Loading..