సినిమా తారలపై అభిమానం ఉండొచ్చు కానీ, తొక్కిసలాటలో నలిగిపోయి చచ్చేంత.. 300 టికెట్ ని 2లక్షలు పెట్టి కొనుగోలు చేసేంత ఉండకూడదు. దీనిని తమ అభిమాన తారపై అపరిమితమైన ప్రేమ అని గొప్పలకు పోవచ్చు కానీ, నిజానికి స్టార్లు కూడా ఇలాంటివి కోరుకోవడం లేదు. ఇటీవలి కాలంలో స్టార్ హీరోలు తమకు మూర్ఖత్వం లేదని, తమపై అభిమానం పేరుతో తొక్కిసలాటలో చనిపోవద్దని, మీ కుటుంబాలకు మీరు అవసరమని కూడా మైకుల ముందు పదే పదే చెబుతూనే ఉన్నారు. పవన్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్.. పెద్ద హీరోలు ఎవరూ తమ అభిమానులు స్టాంపీడ్ పాలు కావాలని కోరుకోవడం లేదు. అభిమాని కానీ, వారి కుటుబం కానీ బాధపడితే దానిని తమ బాధగా ఫీలవుతున్నారు.. కలతకు గురవుతున్నారు.
ఒక్కోసారి అభిమానం హద్దు మీరి కుటుంబాలకు దూరమైపోతున్న పిచ్చి ఫ్యాన్స్ గురించి వింటుంటే చలించిపోకుండా ఉండలేం. గతంలో ఫేవరెట్ స్టార్ ని వీక్షించేందుకు విద్యుత్ పోల్ పై కరెంటు తీగల్ని పట్టుకుని చనిపోయాడో అభిమాని. ఆ తర్వాత థియేటర్ లో తొక్కిసలాటలో తల్లి చనిపోగా కొడుకు ఆస్పత్రి పాలైన ఘటనను చూసాం. తాజాగా ఓ ప్రముఖ హీరో అభిమాని ఏకంగా మొదటి రోజు సినిమా వీక్షించడానికి ఒక టికెట్ కోసం ఏకంగా రూ.2,00,000/ - చెల్లించాడట. ఇదంతా తమ అభిమాన హీరోపై ఉత్సాహం అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి రూ.200-300 మధ్య ధర పలికే టికెట్ అందుబాటులో ఉన్నా కానీ ఇలాంటి పిచ్చి వెర్రి వేషం ఎందుకు వేసాడో ఎవరికీ అర్థం కాలేదు. రూ.2లక్షలు చాలా పెద్ద మొత్తం. దానిని అతడు తన కుటుంబీకుల అవసరానికి ఖర్చు చేయలేదు.
నిజానికి ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ ప్రివ్యూలు అంటూ టికెట్ దోపిడీకి అంతూ దరీ లేదు. దీనిని వెర్రి అభిమానులు ఎంకరేజ్ చేయడం పెద్ద చేటుగా మారింది. మొదటి వారం ప్రభుత్వాల అనుమతి సంపాదించి దోపిడీ కి పాల్పడుతున్న వారికి ఇవన్నీ బాసటగా నిలవడమే. అందుకే సీపీఐ నారాయణ వంటి ప్రముఖులు వ్యవస్థలు మారనంతవరకూ ఐబొమ్మ రవిలు పుట్టుకొస్తారని అన్నారు. నేడు థియేటర్ లో టికెట్ ధర కంటే తిండి పదార్థాలు, కోలాలు కొనేందుకే జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి. ఇలాంటి ఎన్నో కారణాలు నేడు సినిమాని బతకనీకుండా చేస్తున్నాయి. అయితే వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా పైపై దిద్దుబాటు చర్యలకు దిగినా మళ్లీ అదే పరిస్థితి రిపీటవుతుంది. వంద మంది ఐబొమ్మ రవిలు పుట్టుకు రావడం ఖాయం.




పెద్ది కి కళ్ళు చెదిరే ఓటీటీ డీల్
Loading..