ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణాన్ని అనుమానాస్పద మరణంగా నిర్ధారించిన ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆదేశించిన సంగతి తెలిసిందే. అతడి మరణం వెనక మిస్టరీని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నెమ్మదిగా ఛేధిస్తోంది. తాజా సమాచారం మేరకు గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదని తెలుస్తోంది. అతడికి ఎలా చంపారు అన్నదానిపై రిమాండ్ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. సింగపూర్ యాచ్ పార్టీలో అతడు ఈదడానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. అతడు నీటిలో శవమై తేలాడు. కానీ దీని వెనక మిస్టరీ దాగి ఉందని సిట్ అనుమానించి విచారిస్తోంది.
జుబీన్ గార్గ్ దుర్మరణం పాలైన తర్వాత విచారణలో భాగంగా నలుగురిని అరెస్ట్ చేసి సిట్ విచారిస్తోంది. ఈ విచారణలో జుబీన్ గార్గ్ కి అత్యంత సన్నిహితులు, వ్యక్తిగత మేనేజర్ ని రిమాండ్ కి పంపి విచారించగా అసలు నిజాలు వెల్లడించారు. జుబీన్ ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించలేదు. అతడిని ఉద్ధేశపూర్వకంగా, కుట్ర పూరితంగా హత్య చేసారని జుబీన్ బృంద సభ్యుడు శేఖర్ జ్యోతి గోస్వామి రిమాండ్ లో వెల్లడించారని కథనాలొస్తున్నాయి.
మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ నిర్వాహకుడు శ్యామ్ కను మహంత విషమిచ్చి హత్య చేసారని గోస్వామి సిట్ అధికారుల విచారణలో వెల్లడించారని తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని నిరూపించేందుకు వారు శతవిధాలా ప్రయత్నించారు. కానీ చివరికి నిజం దాగలేదు. విచారణాధికారులు తెలివిగా సమాధానాల్ని రప్పించారు. అస్సామీ గాయకుడు జుబీన్ కి రాష్ట్ర వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. అతడి పాట అస్సామీ సంస్కృతికి చిహ్నంగా ప్రజలు భావిస్తారు.
అతడి సామాజిక సేవలకు గొప్ప గుర్తింపు ఉంది. అతడి అంత్యక్రియల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొనడం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చేరడానికి కారణమైంది.