కొద్దిరోజుల క్రితం పాపులర్ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం అభిమానుల్లో విషాదం నింపిన సంగతి తెలిసిందే. సింగపూర్ లో విహార యాత్రలో ఉన్న అతడు యాచ్ నుంచి స్విమ్ చేసేందుకు నీటిలోకి దూకాడు. ఆ తర్వాత శవమై తేలాడు. అయితే సింగపూర్ నుంచి ఇండియాకు, దేశంలో అతడి స్వస్థలం గౌహతికి పార్థీవ దేహాన్ని తరలించిన క్రమంలో లక్షలాది మంది అతడి కోసం తరలి రావడం, ప్రజలంతా అతడు పాడిన పాటలు పాడుతూ, వీధుల వెంబడి ఏడుస్తూ కనిపించిన దృశ్యాలు ఆశ్చర్యపరిచాయి. జుబిన్ గార్గ్ అస్సామీలకు గాయకుడిని మించి.. అతడు అస్సాం సంస్కృతికి సింబల్.
అయితే ఈ గాయకుడి మరణం వెనక మిస్టరీని ఛేధించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ కేసులో ఇప్పటికే అరెస్టులు నాలుగుకు చేరుకున్నాయి. జుబీన్ కి అత్యంత సన్నిహితులను ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసారు. గార్గ్ కి కెందిన మ్యూజిక్ బ్యాండ్ లో కీలక సహచరుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకుడు అమృత్‌ప్రవ మహంతను సిట్ అధికారులు అరెస్ట్ చేసారు.
గార్గ్ సింగపూర్ యాచ్ పార్టీ సమయంలో ఈత కోసం దిగినప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు కెమెరాలో షూట్ చేస్తుంటే, మరొకరు గార్గ్ తో పాటు స్విమ్ చేస్తూ కనిపించారు. దీనిని సిట్ అధికారులు సీసీ టీవీల ద్వారా కనుగొన్నారు. తదుపరి విచారణ కోసం వారు సింగపూర్ వెళ్లేందుకు కూడా ఏర్పాట్లలో ఉన్నారని తెలుస్తోంది. అయితే జుబీన్ మృతి ప్రస్తుతానికి అనుమానాస్పద మరణంగానే పోలీసులు భావిస్తున్నారు. విచారణలో నేరం జరిగిందా? లేక అతడు ప్రమాదవశాత్తూ మరణించాడా? అన్నది సిట్ తేల్చాల్సి ఉంది.