60 కోట్ల మోసం కేసు సహా క్రిప్టో కరెన్సీ చీటింగ్ కేసులోను శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా జంట తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వ్యాపారి దీపక్ కొఠారిని 60 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఇప్పుడు లుకౌట్ నోటీస్ జారీ చేయడం సంచలనంగా మారింది. శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా, కుటుంబీకులు విదేశాలకు వెళ్లకుండా ఈ లుకౌట్ నోటీస్ జారీ చేయడం హాట్ టాపిగ్గా మారింది.
శిల్పాశెట్టి- కుంద్రా దంపతులు పుకెట్ లో విహార యాత్ర కోసం ముందస్తుగా కొనుగోలు చేసిన టికెట్లను చూపించి తమకు రిలీఫ్ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు. కానీ ఆర్థిక నేరంలో దర్యాప్తు కొనసాగుతుండగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని ముంబై హైకోర్ట్ తీర్పు వెలువరించింది. ముంబై ఆర్థిక నేరాల విభాగం జారీ చేసిన లుకౌట్ నోటీస్ ని ఆపేయాలని కుంద్రా న్యాయవాది ఎంతగా వాదించినా జడ్జి తీర్పు వారిని నిరాశపరిచింది.
బెస్ట్ డీల్ టీవీ వ్యాపారం పేరుతో రాజ్ కుంద్రా వ్యాపారి దీపక్ కొఠారిని 60 కోట్ల మేర మోసం చేసారనేది ఆరోపణ. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. అదే సమయంలో క్రిప్టో స్కామ్ స్టర్ భరద్వాజ్ తో కలిసి క్రిప్టోకరెన్సీ- బిట్ కాయిన్ స్కామ్ కి తెర తీసాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయంతో పాటు బిపాసాబసు, నేహా ధూపియా, ఏక్తా కపూర్ కి చెందిన బాలాజీ టెలీ ఫిలింస్ పైనా ఆరోపణలు వచ్చాయి.