దాదాపు 3,300 కోట్ల బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా - యష్ బృందాలు రామాయణం చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాల సిరీస్ ఇది. ఇప్పటికే మొదటి భాగం చిత్రీకరణ దాదాపు పూర్తయిందని నమిత్ మల్హోత్రా తాజా పాడ్ కాస్ట్ లో వెల్లడించారు. ఈ సినిమా కోసం 3300- 4000 కోట్ల మేర బడ్జెట్ ఖర్చవుతోందని కథనాలొస్తున్నాయి. అయితే ఇంత పెద్ద బడ్జెట్ ని ఎలా తెస్తున్నారు? నిధిని ఎలా సేకరిస్తున్నారు? అంటూ తనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చిత్రబృందం లో, నటీనటులు కూడా తనను ప్రశ్నించారని నమిత్ తాజా పాడ్ కాస్ట్ చాట్ లో తెలిపారు.
అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో.. ఎలా వస్తోందో తనకు కూడా తెలియదని, తాను డబ్బును దృష్టిలో ఉంచుకోనని, ఉత్పత్తి ఎంత క్వాలిటీగా వస్తోందో అది మాత్రమే పట్టించుకుంటానని నమిత్ మల్హోత్రా అన్నారు. డబ్బు దానంతట అదే వస్తోంది. రాజీ అన్నదే లేకుండా సినిమాను నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక భారతీయ పురాణేతిహాసాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ధ్యేయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. కాపీ లేని ఒరిజినల్ కథను ప్రపంచానికి అందిస్తామని తెలిపారు. తమ కంపెనీ డిఎన్ఇజి కరోనా సమయంలో 11000 మందికి జీతాలిచ్చి పోషించిందని, ఎన్నో హాలీవుడ్ సినిమాలకు పని చేయగా, లెక్కలేనన్ని ఆస్కార్ లు దక్కాయని కూడా నమిత్ తెలిపారు. రామాయణం వాటన్నిటికీ మించి ఉండాలన్న తన పట్టుదలను కూడా ఆయన దాచుకోలేదు.
వచ్చే ఏడాది దీపావళికి రామాయణం పార్ట్ 1 విడుదలకు రానుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డిఎన్ఇజి సంస్థతో కలిసి నమిత్ మల్హోత్రా- యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యష్ ఈ చిత్రంలో రావణుడిగా నటిస్తుండగా, శ్రీరాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి, ఆంజనేయుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు.