తమిళనాడులో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. హీరో విజయ్ పొలిటికల్ ర్యాలీ కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించగా.. అనేకమంది క్షతగాత్రులు కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరగడానికి కారణం విజయ్ అంటూ డీజీపీ వెంకటరామన్ ఆరోపిస్తున్నారు. మరోపక్క విద్యార్థి సంఘాలు విజయ్ ని అరెస్ట్ చెయ్యాలని ఆందోళన చేపట్టాయి.
ఈ ఘటన జరగకముందు విజయ్ నిన్న శనివారం మద్యాన్నం 12 గంటలకు ర్యాలీ అని చెప్పి 10 వేల మంది ర్యాలీకి అనుమతి తీసుకోగా.. విజయ్ ఆరు గంటల ఆలస్యంగా సాయంత్రం 7 గంటలకు ర్యాలీ కి వచ్చేసమయానికి అక్కడికి 30 నుంచి 40 వేల మంది పోగయ్యారు. దానితో ఈ ర్యాలీ లో విజయ్ మాట్లాడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగిపోయింది. ఈ ఘటన తర్వాత విజయ్ కరూర్ నుంచి చెన్నై కి వెళ్లిపోయారు.
కరూర్ తొక్కిసలాట ఘటన తన మనసును కలిచివేసింది అని, ఈ బాధను భరించలేకపోతున్నట్లుగా విజయ్ సోషల్ మీడియా వేదికగా ఈ తొక్కిసలాటలో మరణించినవారికీ 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరోపక్క ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ఇంటి దగ్గర బందోబస్తు పెంచేశారు. విజయ్ ను అరెస్ట్ చెయ్యాలంటూ విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. మరి ఈ ఘటన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం విజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.