ఇటీవలి కాలంలో స్టార్ హీరోలు భారీ పారితోషికాలు, దాంతో పాటు లాభాల్లో వాటాలు అందుకుంటున్నారు. సొంత బ్యానర్లు స్థాపించి, తమ పారితోషికాలనే సినిమాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలంటే, తెలివైన వ్యూహాలను రచిస్తున్నారు. అలాంటి వ్యూహరచనలో తానేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు ఒక యంగ్ హీరో.
ఈ యంగ్ హీరో ముంబై రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు ఇటీవలే ముంబై అలీభాగ్ లో 2 కోట్ల ఖరీదు చేసే అపార్ట్ మెంట్ కొనుగోలు చేసాడు. ఇంతలోనే అందేరి వెస్ట్ లో 13 కోట్లతో ఆఫీస్ స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. 2000 చ.అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆఫీస్ కి మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. అందేరి వెస్ట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ సెలబ్రిటీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి రవాణా సౌకర్యం అద్భుతంగా ఉంది. విమాన యానానికి కూడా అనువైన ప్రదేశమిది. అందువల్ల చాలా మంది సెలబ్రిటీలు పెట్టుబడులు పెట్టారు. బచ్చన్, కపూర్ కుటుంబాలతో పాటు చాలామంది స్టార్లు ఇక్కడ ఆఫీస్ స్థలాలు, అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ వ్యూహాత్మకంగా సొంతంగా ఒక పెద్ద ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు.
మహమ్మారీ తర్వాత కార్తీక్ ఆర్యన్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా భూల్ భులయ 2 చిత్రం 300 కోట్లు పైగా నికర వసూళ్లను సాధించడంతో అతడికి ప్యాకేజీ భారీగా పెరిగింది. దాదాపు 30 కోట్లు పైగా పారితోషికాలు అందుకుంటున్నాడని తెలుస్తోంది. తాను అందుకుంటున్న అడ్వాన్సులను అతడు అనవసరంగా ఖర్చు చేయకుండా, తెలివిగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నాడు. భూల్ భులయా 2, సత్య ప్రేమ్ కి కథ చిత్రాలు మంచి విజయాలను సాధించాక, వరుస పెట్టి సినిమాలకు సంతకాలు చేసాడు. తనకు వచ్చే డబ్బును వెంటనే వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నాడు.