1998లో `హమ్ సాథ్ సాథ్ హై` షూటింగ్ సమయంలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బృందం అడవిలో కృష్ణ జింకను వేటాడిన సంగతి తెలిసిందే. సల్మాన్ తో పాటు ఆ సమయంలో సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రే, సింగ్ ఉన్నారు. వీరిపై బిష్ణోయ్ కమ్యూనిటీ కేసులు ఫైల్ చేసింది. ఈ కేసు దశాబ్ధాల పాటు జోధ్ పూర్ కోర్టులో విచారణలో ఉంది. అయితే అప్పట్లోనే ఒక స్థానిక కోర్టు సల్మాన్ ని దోషిగా ప్రకటిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, ఫైన్‌ను విధించింది. ఈ కేసుతో సైఫ్, టబు, బింద్రేలకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధోషులుగా విడుదల చేసింది.
కానీ ఇప్పుడు ఈ కేసులో ఊహించని ట్విస్టు ఎదురైంది. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వమే నేరుగా పూనుకుని అప్పట్లో ఈ కేసు నుంచి నిర్ధోషులుగా విడుదలైన వారిపై తిరిగి విచారించాలని, ఆధారాలు రీప్రొడ్యూస్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయడంతో కలకలం రేగింది. ఓవైపు జోధ్ పూర్ కోర్టులో తాను ఎలా దోషి అన్నది ప్రతివాది నిరూపించాలని సల్మాన్ పిటిషన్ వేసాడు. ఈ కేసు విచారణ సాగుతుండగానే, ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం సల్మాన్ సహచర బృందంపై కేసు వేయడంతో కోర్ట్ రూమ్ డ్రామా రక్తి కడుతోంది. ఈ కేసును తిరగతోడితే ఇప్పుడు సల్మాన్ కి మరిన్ని చిక్కులు తప్పవని అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
మరోవైపు సల్మాన్ ని చంపేస్తానంటూ బిష్ణోయ్ తెగ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వార్నింగులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు హైటెన్షన్ లో ఉన్నారు.