మెగాస్టార్ మొట్టమొదటగా నటించిన ప్రాణం ఖరీదు విడుదలై 47 సంత్సరాలు పూర్తవడంతో చిరు చిన్న తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అన్న మెగాస్టార్ సినీ జర్నీపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. నెల్లూరులో మేము ఉన్న రోజులు, నేను ఇంకా స్కూల్లో ఉన్న సమయం.. ప్రాణం ఖరీదు సినిమాలో పెద్దన్నయ్య హీరోగా నటించిన ఆ రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి. కనకమహల్ థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజు నా ఆనందానికి అంతులేని ఉత్సాహం కలిగింది, అది మాటల్లో వర్ణించలేనిది కూడా.
47 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ప్రతి అంశంలోనూ ఆయన అసాధారణంగా ఎదిగిన తీరు, అయినప్పటికీ అలసిపోని తత్వం, వినయంతో సహాయం చేసే ఆప్యాయమైన స్వభావాన్ని కోల్పోకుండా ఉండటం నిజంగా స్ఫూర్తిదాయకం. దుర్గమ్మ తల్లి ఆయనకు విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నా. రాబోయే సంవత్సరాల్లో ఆయన మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో కనిపించాలని ఆశిస్తున్నా. ఆయనకు రిటైర్మెంట్ అనేదే లేదు. జన్మతః యోధుడు.. మన ప్రియమైన పెద్దన్నయ్య, శంకర్ బాబుగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు అంటూ ట్వీట్ చేశారు.
తమ్ముడు పవన్ ట్వీట్ కి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. డియర్ కళ్యాణ్ బాబు, నీ మాటలు నా మనసును తాకాయి. నన్ను బిగినింగ్ డేస్‌కి తీసుకెళ్లాయి. ప్రాణం ఖరీదు నుంచి ఇప్పటి వరకు నాకు లభించిన అభిమానుల ప్రేమ, కుటుంబం, స్నేహితుల ప్రోత్సాహానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. నీకు దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓజీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. టీం అందరికీ శుభాకాంక్షలు అంటూ చిరు రిప్లై ఇచ్చారు.