సింగపూర్ లో కూబా డైవింగ్ లో ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించారు అస్సామీ గాయకుడు జూబీన్ గార్గ్. కూబా డైవింగ్ జాకెట్ ని సరిగా ఉపయోగించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని వార్తలు వస్తున్నాయి. మరణానంతరం ఆయన పార్థీవ దేహాన్ని సింగపూర్ నుంచి భారతదేశానికి తిరిగి తీసుకుని వచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అతడి భౌతిక కాయాన్ని అస్సామ్ కి తరలించారు. అయితే అస్సామ్ - గౌహతిలోని ఆయన ఇంటికి వాహనంలో వెళుతున్నప్పుడు దారి పొడవునా వీధుల్లో వేలాదిగా అభిమానులు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యాలు హృద్యంగా కనిపించాయి. జూబీన్ గార్గ్ అస్సామీ ప్రజలకు ఆరాధ్య గాయకుడు. అతడి స్నేహ స్వభావం, వేలాది మందిని కష్టాల్లో ఆదుకున్న గొప్ప మానవతా వాదిగా అతడు ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాడు. గాయకుడిగా 38000 పైగా పాటలు పాడిన 52 ఏళ్ల ఈ ప్రతిభావంతుడు ఈరోజు ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అతడి భౌతిక కాయాన్ని గౌహతిలోని స్వగృహానికి తరలిస్తున్న సమయంలో వీధుల్లో వేలాదిగా యువతరం వాహనాలపై ర్యాలీ నిర్వహించడం కనిపించింది. కొందరు కన్నీటి పర్యంతమై జూబీన్ పాడిన పాటలు పాడటం కూడా ఆశ్చర్యపరిచింది. వీటన్నిటినీ మించి ఈ వార్తను కవర్ చేస్తున్న ఎన్డీటీవీ ప్రతినిధి తన లైవ్ రిపోర్టింగ్ లో ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేసారు. ఇదంతా చూస్తుంటే అస్సామీ కల్చర్ లో జూబీన్ పాట ఎంతటి భావోద్వేగంతో లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
టాలీవుడ్ దిగ్గజ నటుడు శోభన్ బాబు మరణించినప్పుడు, అంతిమయాత్ర రోజు బోరున వర్షం పడుతోంది. ఎవరూ అంతిమయాత్రకు రాలేరని భావించారు. కానీ చెన్నై వీధులు వర్షంలో కూడా కిటకిటలాడాయని దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఒక గాయకుడి కడసారి చూపు కోసం అంతగా ప్రజలు వీధుల్లోకి రావడం కనిపించింది.