హనుమాన్, కాంతారా, మిరాయ్, లోకా.. ఇటీవలి కాలంలో పరిమిత బడ్జెట్ లో తెరకెక్కి వందల కోట్లు వసూలు చేసిన సినిమాలు. ఈ సినిమాల విజయానికి కలిసొచ్చిన పాయింట్ ఏమిటో ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ప్రముఖ విశ్లేషకుడి ప్రకారం.. ఈ సినిమాల కథలు ఆత్మతో కనెక్టయినవి. ఇవి నేటివిటీ టచ్ తో ప్రాంతీయ ఉద్వేగాన్ని కలిగి ఉన్నాయి. ప్రజల సున్నిత మనసులను టచ్ చేసాయి. అలాగే ఈ సినిమాలో సాంకేతిక విభాగాల కోసం కేటాయించిన బడ్జెట్ ని దానికోసం మాత్రమే ఖర్చు చేయడం కూడా కలిసొచ్చింది. మంచి కథల ఎంపిక కూడా ఆయా సినిమాల విజయంలో కీలక పాత్రను పోషించింది.
దక్షిణాదితో పోలిస్తే హిందీ చిత్రసీమలో ఫిలింమేకర్స్ వర్కింగ్ స్టైల్ వేరు. వారు ఇంగ్లీష్ మాట్లాడుతూ, ఆంగ్ల సినిమాలు చూస్తూ వాటి కాపీలను వెండితెరకెక్కిస్తున్నారని ఇవి స్థానికులతో కనెక్ట్ కాలేవని అతడు విశ్లేషించాడు. కాఫీ షాప్ లో వెస్ట్రన్ సినిమాలు చూసి కథలు రాసుకునే బాపతు కావడం వల్లనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయని అన్నారు. అలాగే బడ్జెట్ లో 70శాతం కేవలం హీరో, నిర్మాతకే చెల్లించాల్సి వస్తోంది. దీని వల్ల కూడా క్వాలిటీ ఉత్పత్తిని అందించలేకపోతున్నారని విశ్లేషిస్తున్నారు.
మంచి కథలను వెతకడంలో హిందీ ఫిలింమేకర్స్ విఫలమయ్యారని విమర్శించారు. అలాగే సెట్లలో ఇంగ్లీష్ మాట్లాడుతూ, ఆంగ్ల సినిమాలు కాపీ కొడుతూ సినిమాలు తీస్తే అది ప్రజలకు కనెక్ట్ కాదని అన్నారు. ప్రధాన నగరాల నుంచి కాకుండా చిన్న సిటీల నుంచి వచ్చే రచయితలు నేటివిటీ టచ్ తో మంచి స్క్రిప్టులను అందించేందుకు ఆస్కారం ఉందని కూడా సూచించారు.