బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి పలువురు తారలు విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ స్టార్లు సహా ఊర్వశి రౌతేలాకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. అయితే బెట్టింగ్ యాప్ ల కేసులో విచారణకు హాజరు కాకుండా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఈడీకి చుక్కలు చూపిస్తోందని సమాచారం. ఊర్వశిని ఈడీ విచారణకు పిలిచింది. కానీ వస్తుందా లేదా అనేది ఇంకా ఏజెన్సీకి తెలియజేయలేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఊర్వశి ఏజెన్సీని సంప్రదించలేదని సమాచారం.
ఊర్వశి రౌతేలా సెప్టెంబర్ 16న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా విఆచరణకు హాజరు కాలేదని తెలిసింది. వరుసగా ఇలా చేయడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో కూడా ఈడీ ఊర్వశికి సమన్లు జారీ చేసింది. అప్పట్లో కూడా విచారణాధికారుల ముందుకు ఊర్వశి రాలేదు. ఈ కేసులో ఇప్పటికే గత మార్చిలో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా 25 మంది ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.
టాలీవుడ్ స్టార్లు ఎప్పుడూ ఈడీని ఇబ్బంది పెట్టలేదు కానీ ఊర్వశి మాత్రం చుక్కలు చూపిస్తోందని సమాచారం. బెట్టింగ్ యాప్ లకు బాధ్యతాయుతమైన సెలబ్రిటీలు ప్రచారం చేయడం సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. వారు త్వరగా ప్రభావతమై యాప్ లలో నష్టపోతున్నారని ఫిర్యాదు అందింది. దీంతో ఇంతకుముందు 29మంది ఈడీ పరిధిలోకి వచ్చారు. ఈ ఎండార్స్‌మెంట్‌లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆన్‌లైన్ మార్గాలను ఏజెన్సీ పరిశీలిస్తోంది.