మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ - అల్లు అరవింద్ మధ్య సుదీర్ఘ (లాంగ్ బ్యాక్) కనెక్షన్ గురించి తెలిసిందే. అమీర్ ఖాన్ కి, అలాగే బాలీవుడ్ కి మొదటి 100 కోట్ల క్లబ్ సినిమాని ఇచ్చిన నిర్మాత అల్లు అరవింద్. `గజిని` రీమేక్ సినిమాతో ఆ ఇద్దరూ ఈ ఫీట్ ని సాధించారు. అయితే గజిని సినిమా కోసం రాజీ అన్నదే లేకుండా అరవింద్ బడ్జెట్ కేటాయించారని అమీర్ ఖాన్ అప్పట్లో అన్నారు. ఈ సినిమా కూడా డిలే అవుతూ చివరికి విడుదలైంది. కానీ పెద్ద విజయంతో అనుకున్న లక్ష్యం సాధించింది.
కానీ లాల్ సింగ్ చడ్డా చిత్రంతో అమీర్ ఖాన్ దీనిని సాధించడంలో విఫలమయ్యారు. తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఈ సినిమా వైఫల్యానికి కారణమేమిటో వివరించారు. తన సినిమా ఎంత వసూలు చేస్తుందో ముందే తెలుసునని, 120 కోట్లు మించి వసూలు చేయదని తెలుసు గనుక 80 కోట్లలో సినిమా తీయాలని అనుకున్నట్టు అమీర్ తెలిపాడు. కానీ కోవిడ్ 19 పరిస్థితిని మార్చేసింది. ఖాళీగా ఉన్న సమయంలో సిబ్బందికి పారితోషికాలు చెల్లించానని అమీర్ వెల్లడించాడు. చైనా షూటింగ్ మెజారిటీ బడ్జెట్ ని తినేసింది. విదేశీ షూట్ లు, అంతకంతకు ఆలస్యాలు కొంప ముంచాయని అమీర్ విశ్లేషించాడు. చివరికి 80 కోట్లు అనుకున్నది 200 కోట్ల వరకూ బడ్జెట్ చేరుకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నాడు. స్వతహాగా బడ్జెట్ కోతలు తనకు తెలిసినా దానిని అనుసరించకుండా అతి విశ్వాసంతో ఉండటం కూడా సమస్యగా మారిందన్నాడు.
బడ్జెట్లను తెలివిగా కోతలు పెట్టేవాడే ప్రముఖ నిర్మాతగా ఎదుగుతాడు. దేనికి ఖర్చు చేయాలో అతడికి మాత్రమే తెలుస్తుంది. ప్రెస్టేజ్ కి వెళితే మూతి వాస్తుంది. అన్నిటికీ అతీతుడు కాబట్టే అల్లు అరవింద్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా అనుకున్నది సాధించారు. అమీర్ ఖాన్ కూడా అంతటివాడే. కానీ లాల్ సింగ్ చడ్డా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచింది.