71వ జాతీయ అవార్డుల విజేతలను ఆగస్టు1న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజేతలందరికీ అవార్డులు అందుకునే ఒక వేదికను సమయాన్ని ఫిక్స్ చేసారు. తేదీ- వేదిక- సమయం అన్నిటినీ లాక్ చేసాక సంబంధిత వివరాలను విజేతలతో పాటు, జూరీకి పంపించారని బాలీవుడ్ హంగామా తన కథనంలో పేర్కొంది.
న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఆగస్టు ఒకటిన పురస్కార విజేతలను ప్రకటించారు. సెప్టెంబర్ 23న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో సాయంత్రం 4 గంటలకు అవార్డులను ప్రదానం చేస్తారు. దిల్లీ విమానాశ్రయం నుంచి విజేతల పికప్- డ్రాపాఫ్ ఉంటుంది. విజేతలు పురస్కారాలు అందుకునేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ నుంచి షారూఖ్, విక్రాంత్ మాస్సే, రాణి ముఖర్జీ పురస్కారాలు అందుకుంటారు. ఖాన్ (జవాన్ కోసం) తో మాస్సే (ట్వల్త్ ఫెయిల్) ఉత్తమ నటుడు అవార్డును షేర్ చేసుకుంటాడు. రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటుంది.
ఈ ఏడాది ఉత్తమ ప్రాంతీయ సినిమాగా ఎంపికైన `భగవంత్ కేసరి` తరపున పురస్కారం అందుకునేందుకు బాలయ్య- అనీల్ రావిపూడి బృందం న్యూఢిల్లీలో అడుగుపెడుతుందన్నమాట. అలాగే హనుమాన్ కి ఉత్తమ యాక్షన్ కేటగిరీలో పురస్కారం లభించినందున ఆ చిత్ర దర్శకనిర్మాతలు, హీరో, స్టంట్ కొరియోగ్రాఫర్ తదితరులు న్యూధిల్లీకి వెళ్లే ఛాన్సుంటుంది. బలగం గేయ రచయిత కాసర్ల శ్యామ్ కూడా న్యూఢిల్లీకి వెళతారు.