భారతదేశంలోని అత్యుత్తమ స్టార్లను కలిగి ఉన్న కోలీవుడ్ ఇప్పటికీ రూ.1000 కోట్ల క్లబ్ అందుకోలేకపోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ సమాధానమిచ్చారు. తమిళంలో కంటెంట్ నాణ్యత సమస్య అయి ఉండొచ్చని నిజాయితీగా అంగీకరించారు. ఎంపిక చేసుకునే కథలు పాన్ ఇండియా రీచ్ లేనివి అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే తమిళనాడులో టికెట్ ధరలు కూడా ఒక సమస్య అని అన్నారు. బెంగళూరు, ముంబై లాంటి చోట్ల టికెట్ ధరలకు సమానంగా ఉండి ఉంటే తమిళ సినిమా వసూళ్లు పెరిగేవని అభిప్రాయపడ్డారు. తాను టికెట్ ధరల పెంపును సమర్థించను అని అంటూనే, భవిష్యత్ లో తమిళ సినిమా 1000 కోట్ల్ క్లబ్ ని చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసారు.
టికెట్ ధరలు ఇతర మెట్రోల్లో ఉన్నట్టే తమిళనాడులో ఉండి ఉంటే `జైలర్` (రజనీకాంత్) చిత్రం వెయ్యి కోట్లు కాకపోయినా కనీసం 800కోట్లు వసూలు చేసి ఉండేదని అన్నారు. తమిళ సినిమా మరో రెండేళ్లలో వెయ్యి కోట్ల క్లబ్ అందుకుంటుందని కూడా అంచనా వెలువరించారు. తన సినిమా అమరన్ ఎంత వసూలు చేస్తుందో ముందే అంచనా వేయలేదని అది మంచి రీచ్ సాధించిందని అన్నారు. తమిళ సినిమా ఉత్తరాదిన బాగా రీచ్ అయితే పెద్ద వసూళ్లు సాధ్యమని అభిప్రాయపడ్డారు. కానీ అక్కడ ఓటీటీ నిబంధన అడ్డంకిగా ఉందని అన్నారు.
పాన్ ఇండియా సినిమాలను తీయలేం. కంటెంట్ ఆమోదయోగ్యత మాత్రమే పాన్ ఇండియా విజయాన్ని అందిస్తుందని శివన్న అన్నారు. అయితే శివకార్తికేయన్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన `మదరాసి` ఐదు రోజుల్లో 50కోట్లు వసూలు చేయలేకపోవడం తీవ్ర నిరాశ.