సాయి రాజేష్ రూపొందించిన `బేబి` 2023లో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి జాతీయ అవార్డు రావడం అరుదైన గౌరవం. ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ వెర్షన్ ని రూపొందిస్తున్నారని చాలా కాలంగా కథనాలొస్తున్నా రకరకాల కారణాలతో ఆలస్యమవుతోంది. ఇంతకుముందు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ని కథానాయకుడిగా ఎంపిక చేసారని కథనాలొచ్చినా, ఆ తర్వాత బాబిల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కాస్టింగ్ ఎంపికల గురించి సాయిరాజేష్ టీమ్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
ఇటీవల సైమా అవార్డుల వేడుకలో సాయిరాజేష్`బేబి` హిందీ వెర్షన్ గురించి ప్రస్థావించారు. బేబి చిత్రాన్ని హిందీలో కొన్ని మార్పు చేర్పులతో తెరకెక్కిస్తున్నామని, స్క్రిప్టులో మరింత బెటర్ మెంట్ చేసామని తెలిపారు. తెలుగు వెర్షన్ విషయంలో కొన్ని వివాదాలు చెలరేగాయి. హిందీ వెర్షన్ లోను వివాదాస్పద సన్నివేశాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని అన్నారు. సయ్యారా ఘనవిజయం నేపథ్యంలో బేబి లాంటి స్క్రిప్ట్ హిందీ బెల్ట్ లో వర్కవుటవుతుందని అంచనా వేస్తున్నారు.
అందుకే రెట్టించిన ఉత్సాహంలో సాయి రాజేష్ హిందీ రీమేక్ పై పని చేస్తున్నారు. త్వరలోనే కాస్టింగ్ ఎంపికలు సహా ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.