ఈసారి దసరా ఉత్సవాలను విజయవాడలో ఒక రేంజులో ప్లాన్ చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈసారి తెలుగు చిత్రసీమ ప్రముఖులంతా కృష్ణా నది పరిసరాల్లో బోలెడంత సందడి చేయబోతున్నారు. ఈనెల 22 నుంచి, వచ్చే నెల 2 వరకూ జరిగే దసరా ఉత్సవాల్లో భాగంగా, తెలుగు సినిమాల ప్రమోషన్స్ ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ప్లాన్ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
హైదరాబాద్ కాదు అమరావతి! అనే రేంజులో ఈసారి తెలుగు స్టార్లు అందరూ తమ సినిమాల ఆడియోలు, ప్రీరిలీజ్ ఉత్సవాలకు వేదికను మార్చేసారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు, బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కిస్తున్న `అఖండ 2` ప్రచార ఈవెంట్లు విజయవాడలో జరగనున్నాయి. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ భారీ ఈవెంట్ కోసం విజయవాడను వేదికగా ఎంచుకోవడం చర్చగా మారింది. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ఈవెంట్ కూడా విజయవాడలోనే ప్లాన్ చేయడం ఆసక్తికరం. విజయవాడ పున్నమి ఘాట్, తుమ్మల కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల వంటి వేదికలను ఈవెంట్ల కోసం ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. దసరా ఉత్సవాల వేళ ఓవైపు సాంస్కృతిక కార్యకలాపాలు, మరోవైపు సినిమాల ప్రచార వేడుకలతో విజయవాడ నగరం ఫోకస్సివ్ గా కనిపించబోతోంది.
మునుపటితో పోలిస్తే టాలీవుడ్ ప్రముఖుల ఫోకస్ విజయవాడ- అమరావతిపైనే ఉందని చెప్పేందుకు దసరా ఉత్సవాలను ఉపయోగించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయవాడ- వైజాగ్- తిరుపతిలో వరుసగా ఈవెంట్లను నిర్వహించడం ద్వారా టాలీవుడ్ ఏపీకి తరలి రావడం ఖాయమనే సంకేతాలు పంపడం కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు. చిరు-పవన్- బాలకృష్ణ వంటి ప్రముఖ స్టార్లు విజయవాడ ఈవెంట్లలో సందడి చేస్తే వచ్చే కళే వేరు. వీళ్లందరితో విజయవాడ-అమరావతికి `ఒక నగరం ఒక వేడుక` పేరుతో సీఎం చంద్రబాబు అండ్ కో బ్రాండింగ్ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది.