హైదరాబాద్ లోఖైరతాబాద్ గణేషుడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరుందో.. హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డుకు అంత క్రేజ్ ఉంది. బాలాపూర్ వినాయక లడ్డు వేలం పాట ఎప్పటికప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట 31 ఏళ్లు పూర్తి చేసుకుంది.
బాలాపూర్ లడ్డూ వేలాన్ని మొట్టమొదటిసారిగా 1994లో నిర్వహించగా అదే బాలాపూర్ గ్రామానికి చెందిన కొలను మోహన్ రెడ్డి అప్పట్లో రూ.450కు బాలాపూర్ గణేష్ లడ్డూ దక్కించుకున్నాడు. గత ఏడాది బాలాపూర్ లడ్డు వేలంలో రూ.30,01,000 రికార్డ్ ధర పలికింది. ఈ ఏడాది వేలంలో గతంలో లడ్డూ దక్కించుకున్న 31 మందితో పాటుగా.. కొత్తగా లడ్డూ వేలం పాటలో మరో ఏడుగురు పోటీపడ్డారు.
ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా చేపట్టిన బాలాపూర్ లడ్డు వేలం లో గణేష్ లడ్డు రూ. 35 లక్షలకు చేరుకుంది. బాలాపూర్ లడ్డూ కోసం గత ఆరేళ్లుగా వేలంలో పాల్గొంటున్న దశరథ్ గౌడ్ ఈ ఏడాది గణేష్ లడ్డు ని దక్కించుకున్నాడు. రికార్డ్ ధర తో బాలాపూర్ గణేష్ లడ్డు మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.