తెర నిండుగా రక్తం ప్రవహించాలి. కత్తులు, గొడ్డళ్లతో నరుక్కోవాలి. నిలువునా చీరేయాలి. హింసించి చంపాలి. ప్రతి ఫ్రేమ్‌లోను హింస, క్రూరత్వం, భీతావహ వాతావరణం కనిపించాలి..! అప్పుడే జనం థియేటర్లకు వస్తారు...! ఈ ట్రైలర్ చూడగానే ఎవరైనా ఇలా వర్ణించడం సహజం. ఇలాంటి వర్ణణ సముచితమైనదే. టైగర్ ష్రాఫ్ నటించిన భాఘి 4 ట్రైలర్ చూడగానే ప్రజలు గగుర్పాటుకు గురవ్వాల్సిందే. ఇంతకుముందు కన్నడలో విడుదలైన మార్కో, బాలీవుడ్ లో విడుదలైన కిల్ వంటి చిత్రాలను మించిపోయి విపరీతమైన రక్తపాతం, హింస, క్రూరత్వంతో రూపొందించిన ఈ సినిమా విజువల్స్ సామాన్యులకు గుండె పోటు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
దీనిని శ్రుతిమించిన హింస అనాలా.. లేక క్రియేటివిటీ అనాలా? మొత్తానికి కన్నడ దర్శకుడు ఎ.హర్షతో కలిసి టైగర్ ష్రాఫ్- సాజిద్ నడియాడ్ వాలా (నిర్మాత) చేసిన ఈ భారీ ప్రయోగం ప్రజల్ని థియేటర్లకు రప్పిస్తుందా లేదా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. `భాఘి4` లో అసలేం ఉందో తెలియాలంటే మొదటివారంలో రిలీజ్ కి వస్తున్న సినిమా చూశాకే తేల్తుంది. ప్రస్తుతానికి భాఘి 4 ట్రైలర్లు, పోస్టర్లు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. పెచ్చుమీరిన హింస రక్తపాతం ఘోరమైన విజువల్స్ జుగుప్ప కలిగిస్తున్నాయి.
నిజానికి తెలుగు సినిమా వర్షంకి రీమేక్ గా భాఘి తెరకెక్కింది. ఆ సినిమా క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కానీ భాఘి ఫ్రాంఛైజీలో ఆ తర్వాత సినిమాలను గుర్తు పెట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకనిర్మాతలు విఫలమయ్యారు. ఇప్పుడు భాఘి 4లో కర్కశత్వాన్ని, దారుణ మారణహోమాన్ని చూపిస్తుండటంలో సెన్సిబిలిటీస్ చనిపోయిన ప్రజల కోసం తీసారు! అనే సందేహం కలగక మానదు. భాఘి 4 సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది.