ఏదైనా సినిమాకి సరైన ప్రచారం కుదిరితే, అది ఎంత దూరం అయినా వెళుతుంది! ప్రచారాన్ని బట్టి విజయం డిసైడ్ అవుతున్న రోజులివి. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి అంతర్జాతీయ ప్రమోషన్స్ కోసం ఏకంగా అవతార్, డూన్ చిత్రాలకు పని చేసిన అలెగ్జాండ్రాను బరిలో దించారని తెలుస్తోంది.
AA22XA6 ని అంతర్జాతీయ మార్కెట్లో ప్రమోట్ చేసే బాధ్యతను ప్రముఖ స్టూడియోకి అప్పగించారు. ఈ స్టూడియో ప్రతినిధి, `కోనెక్ట్ మోబ్‌సీన్` ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా ఇ విస్కోంటి ముంబైలో అడుగుపెట్టడమే గాక అట్లీ బృందాన్ని కలవడంతో అది పెద్ద చర్చగా మారింది. అలెగ్జాండ్రా లాంటి ప్రముఖ పబ్లిసిస్ట్, క్రియేటర్ తో కలిసి పని చేయడం అంటే అది సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీని అమాంతం మార్చేస్తుంది. అట్లీ- అల్లు సినిమా కేవలం భారతదేశం లేదా ఇండియన్ డయాస్పారాతో సంబంధం ఉన్న దేశాల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో మార్కెట్ చేయడం ఎలానో అలెగ్జాండ్రా వివరిస్తారు.
ప్రణాళికా బద్ధంగా ప్రతిదీ పూర్తి చేయడం ద్వారా భారతీయ సినిమాని అంతర్జాతీయ మార్కెట్లో నిలబెట్టే సత్తా అలెగ్జాండ్రాకు ఉంది. అందుకే ఇప్పుడు అట్లీ బృందంతో ఆమె చేరిక సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. అవతార్, డూన్, జురాసిక్ వరల్డ్, బార్బీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సహా చాలా చిత్రాలకు అలెగ్జాండ్రా క్రియేటివ్ టీమ్‌లో ప్రచారకర్తగా పని చేసారు. అల్లు అర్జున్ సినిమాతో పాటు, పలు భారీ ఇండియన్ చిత్రాలకు అలెగ్జాండ్రా హాలీవుడ్ లో ప్రచారకర్తగా కొనసాగుతారని గుసగుస వినిపిస్తోంది. అయితే అల్లు టీమ్ ఆమె ఎంపిక గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం ముంబై సహా దేశ విదేశాల్లో అట్లీ - అల్లు అర్జున్ సినిమా కోసం వీఎఫ్ఎక్స్ వర్క్ జరగనుందని సమాచారం.