సైన్స్ ల్యాబ్ లో ప్రయోగం వికటిస్తే, ప్రపంచం ఎలాంటి ముప్పును ఎదుర్కొంటుందో కోవిడ్ 19 వైరస్ ఔట్ బ్రేక్ నిరూపించింది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ కోట్లాదిగా ప్రజల ప్రాణాల్ని హరించింది. చైనా ల్యాబుల్లో ఇంకా ఇలాంటి వైరస్ లు ఎన్నో ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. వీటన్నిటినీ చైనా ప్రపంచం మీదికి వదులుతుందని కూడా కథనాలు వచ్చాయి.
అదంతా అటుంచితే.. లేబరేటరి నుంచి లీకైన వైరస్ కారణంగా మనిషి జాంబీగా మారితే, అటుపై పరిణామాలు ఎలా ఉంటాయో ఆవిష్కరిస్తూ రూపొందించిన `రెసిడెంట్ ఈవిల్` సిరీస్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. రెసిడెంట్ ఈవిల్ స్ఫూర్తితో భారతదేశంలోను ఈ తరహా ప్రయోగాత్మక సినిమాలను రూపొందించారు మన దర్శకులు. కోలీవుడ్ లో జయం రవి జాంబీ కథతో ఓ సినిమాను రూపొందించి తమిళం, తెలుగులోను రిలీజ్ చేసారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డి అనే ఫుల్ లెంగ్త్ జాంబీ మూవీని తెరకెక్కించి ఆశ్చర్యపరిచారు. ఒక ప్రాంతీయ భాషలో ఇలాంటి ప్రయోగాలు చాలా అరుదు. కానీ దానిని జయం రవి, తేజ సజ్జా లాంటి హీరోలతో ప్రతిభావంతులైన దర్శకులు సాధ్యం చేసి చూపించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ జాంబీ మూవీని ప్లాన్ చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే లైన్ ఓకే చేసారు. విష్ణువర్ధన్ బౌండ్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. 2026 లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని కూడా టాక్ వినిపిస్తోంది. విష్ణవర్ధన్ ఇంతకుముందు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పంజా, తళా అజిత్ కథానాయకుడిగా ఆరంభం వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో షేర్ షా లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాన్ని కూడా రూపొందించారు.
అతడు తదుపరి కార్తీక్ ఆర్యన్ ని ప్రయోగాత్మక చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి చక్ దే ఇండియా దర్శకుడు షిమిన్ తో ఏరియల్ యాక్షన్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.