బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఎదురైతే నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. 2023లో రెండు వరుస డిజాస్టర్లు ఈ నిర్మాతను ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఆ రెండు సినిమాల దెబ్బకు అతడు మళ్లీ కోలుకోవడం కష్టంగా మారింది. భారీ హోప్స్ పెట్టుకున్న ఆ రెండు సినిమాలు బయ్యర్లు, పంపిణీ వర్గాలకు తీవ్ర నష్టాలు తెచ్చాయి. దీంతో టాలీవుడ్ లో ఆయన పరపతికి భంగం ఏర్పడింది. ఆర్థికంగాను తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లారని కథనాలొచ్చాయి.
ఆ రెండు సినిమాలు ఏవి? ఆ నిర్మాత ఎవరు? అంటే...! భోళాశంకర్, ఏజెంట్ లాంటి డిజాస్టర్లతో డీలా పడిపోయిన నిర్మాత అనీల్ సుంకర. 2023లో కేవలం నాలుగు నెలల గ్యాప్ తో విడుదలైన ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ ఫలితాలతో అనీల్ సుంకరకు తీవ్ర నష్టాల్ని తెచ్చాయి. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అప్పటి నుంచి సినిమాలు నిర్మించడం లేదు.
సందీప్ కిషన్ హీరోగా `మజాకా`(2025) అనే ఓ చిన్న చిత్రాన్ని మాత్రమే తెరకెక్కించారు. ఆ తర్వాత ఈ బ్యానర్ స్థబ్ధుగా ఉండిపోయింది. ఒకప్పుడు మహేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోలతో సినిమాలు తీసిన ఈ బ్యానర్ ప్రస్తుతం సైలెంట్ గా ఉంది. అయితే నిర్మాత బావుంటేనే పరిశ్రమ బావుంటుంది. అనీల్ సుంకర తిరిగి దూకుడు, లెజెండ్ లాంటి సినిమాలు నిర్మించాలని అభిమానులు కోరుకుంటున్నారు.