ఈసారి సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 19 అంతర్జాతీయ సెలబ్రిటీల వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో రక్తి కట్టించబోతోంది. అంతా సవ్యంగా జరిగితే, ఈసారి బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్- WWE లెజెండ్ ది అండర్ టేకర్ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సీజన్ 19లో పోటీదారుల జాబితాలో గౌరవ్ ఖన్నా, అష్నూర్ కౌర్, బసీర్ అలీ, అభిషేక్ బజాజ్, సివెట్ తోమర్, అవేజ్ దర్బార్ , నగ్మా మిరాజ్కర్ ఉన్నారు. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. అలాగే మైక్ టైసన్ తోను మంతనాలు సాగుతున్నాయని కథనాలొచ్చాయి. కానీ ఇంకా అతడి ఎంట్రీ ఉంటుందా లేదా? అన్నదానిపై స్పష్ఠత లేదు.
రెజ్లింగ్ లెజెండ్ ది అండర్‌టేకర్ అసలు పేరు- మార్క్ విలియమ్ కాలవే. అమెరికా సౌత్ సెంట్రల్ నగరం టెక్సాస్ నుంచి వచ్చిన రెజ్లింగ్ వీరుడు. అతడు నవంబర్ నాటికి, బిగ్ బాస్ 19లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా చేరే అవకాశం ఉందని, ఒక వారం పాటు బిగ్ బాస్ ఇంట్లోనే ఉంటారని చెబుతున్నారు. ఇది 2025లో అస్సలు ఊహించని క్రాస్‌ఓవర్ షోగా దీనిని చెప్పొచ్చు. ప్రస్తుతం రెజ్లింగ్ లెజెండ్ తో ప్రస్తుత చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా ఏదీ అధికారికంగా కన్ఫామ్ కాలేదు.
బిగ్ బాస్ లో డబ్ల్యూడబ్ల్యూఇ స్టార్ ప్రవేశించడం అనేది ఇదే మొదటి సారి కాదు. గతంలో ది గ్రేట్ ఖలీ బిగ్ బాస్ సీజన్ 4లో కనిపించాడు. అతడికి వారానికి రూ. 50 లక్షలు చెల్లించారు. దీనితో బిగ్ బాస్ షో చరిత్రలో అత్యధిక పారితోషికం పొందే సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచాడు. ఇప్పుడు బిగ్ బాస్ 19లో అత్యధిక పారితోషికం పొందే పోటీదారులలో ది అండర్‌టేకర్ పేరు వినిపించనుందని అంచనా. బిగ్ బాస్ సీజన్ 15 మంది పోటీదారులతో ప్రారంభమవుతుంది. తరువాత 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. మొత్తం పాల్గొనేవారి సంఖ్య 18 కి చేరుకుంటుంది. ఆగస్టు 24 న ఇది ప్రీమియర్ కానుంది. బిగ్ బాస్ సీజన్ 19 రాత్రి 9 గంటలకు జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. తరువాత ఎపిసోడ్‌లు రాత్రి 10.30 గంటలకు కలర్స్ టీవీలో ప్రసారం అవుతాయి.