కార్మిక ఫెడరేషన్ సమ్మె కారణంగా ఎక్కడి షూటింగులు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. రిలీజ్ తేదీలు ప్రకటించిన నిర్మాతలు డెడ్ లైన్ ప్రకారం బరిలో దిగాలంటే కార్మికులు కోరినంతా చెల్లించి షూటింగులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికోసం ఫెడరేషన్ గట్టి పట్టు పడుతోంది. తాము అడిగిన 30శాతం వేతన పెంపును అమలు చేస్తూ షూటింగులు చేసుకోవచ్చని ఫెడరేషన్ నిర్మాతలకు వెసులు బాటు కల్పించింది.
అయితే పది రోజులుగా చర్చలు సాగుతున్నా అవి విఫలమవుతూనే ఉన్నాయి. ఈ బుధవారం నాడు ఫెడరేషన్ తో ఫిలింఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతల మండలి పెద్దలు సంయుక్తంగా మరోసారి చర్చలు జరిపారు. కానీ ఇరు వర్గాల మధ్యా మరోసారి చర్చలు విఫలమయ్యాయని తెలిసింది. 30శాతం వేతన పెంపును అమలు చేయాల్సిందేనంటూ కార్మిక ఫెడరేషన్ పట్టు బడుతోంది. దీనికి నిర్మాతలు ససేమిరా అంటున్నారు .దీంతో పది రోజులుగా చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి.
నేటి ఛాంబర్ సమావేశంలో అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, కోశాధికారి ప్రసన్న కుమార్ సహా నిర్మాతల తరపున మైత్రి మూవీ మేకర్స్ అధినేత చెర్రీ, దిల్ రాజు, సి.కళ్యాణ్, ఆచంట గోపీనాథ్, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచిబొట్ల, స్రవంతి రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు సహా ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్ కూడా చర్చా సమావేశాల్లో పాల్గొన్నారు.