2025లో విక్కీ కౌశల్ `చావా` బాలీవుడ్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ద్వితీయార్థం ఆరంభంలో `సయ్యారా` బాక్సాఫీస్ వద్ద గొప్ప హుషారు పెంచింది. కరోనా క్రైసిస్ తర్వాత హిందీ బాక్సాఫీస్ డీలా పడిపోయింది. పెద్ద హీరోల సినిమాలు వరుసగా ఫ్లాపులయ్యాయి. అదే క్రమంలో షారూఖ్ మూడు విజయాలు అందుకోగా, సన్నీడియోల్ గద్దర్ 2 విజయంతో ఊపు తెచ్చాడు. అయితే ఈ ఏడాది విక్కీ కౌశల్ -చావాతో ఉత్సాహం నింపగా, డెబ్యూ హీరో అహాన్ పాండే నటించిన సయ్యారా 300 కోట్ల క్లబ్ లో ప్రవేశించి హిందీ సినిమాకి అతిపెద్ద బూస్ట్ ఇచ్చింది. ప్రేమకథా చిత్రాలకు ఎదురే లేదని నిరూపించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు.
అయితే కొద్దిరోజులుగా `సయ్యారా` చిత్రం ఫలానా కొరియన్ మూవీకి కాపీ అంటూ ప్రచారం సాగుతోంది. కొరియన్ చిత్రం `ఎ మూమెంట్ టు రిమెంబర్`ని కాపీ చేసి మోహిత్ సూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా సయ్యారా రచయిత సంకల్ప్ సదానా స్పందించారు. కొరియన్ సినిమాతో తమ సినిమాని పోల్చి చూసుకోమని, పోలికలు ఎక్కడ ఉన్నాయో తనకు చెప్పాలని అతడు సవాల్ విసిరారు.
తాము ఎలాంటి కంటెంట్ ని కాపీ చేయలేదని ఈ సందర్భంగా వివరణ ఇచ్చాడు. సయ్యారా చిత్రంలో అహాన్ పాండే- అనీత్ పద్దా జంట నటనకు అద్భుత స్పందన వచ్చింది. భవిష్యత్ తారలుగా ఆ ఇద్దరికీ మంచి కెరీర్ ఉందని ప్రశంసలు కురుస్తున్నాయి. మోహిత్ సూరి దర్శకత్వ ప్రతిభపైనా ప్రశంసలు కురిసాయి.