గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఇటీవల బాలీవుడ్ కి దూరమైన సంగతి తెలిసిందే. `స్కై ఈజ్ పింక్` తర్వాత ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే ఈ గ్యాప్ లోనే అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా, పూర్తిగా తన కెరీర్ ని హాలీవుడ్ లో ప్లాన్ చేసింది. కానీ అక్కడ కూడా ఆశించిన విజయాలు దక్కకపోవడంతో ఇప్పుడు భారతదేశంలో మకాం వేసింది. ఇక్కడికి వస్తూనే నేరుగా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి- మహేష్ కాంబినేషన్ లోని ఫారెస్ట్ థ్రిల్లర్ ఎస్.ఎస్.ఎం.బి 29లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది.
బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ తో భారీ మల్టీస్టారర్ మూవీ (గతంలో ప్రకటించారు) అంతకంతకు ఆలస్యం అవుతుండటంతో, పీసీ తదుపరి హృతిక్ తెరకెక్కించే `క్రిష్ 4`లో నటిస్తుందని కూడా ప్రచారం ఉంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. ఇంతలోనే ఇప్పుడు ప్రియాంక చోప్రా నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన అప్ డేట్ అందింది. బాలీవుడ్ కళాత్మక దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న `లవ్ అండ్ వార్` చిత్రంలో ప్రియాంక చోప్రా అతిథి పాత్రలో నటిస్తుందని, ఒక ప్రత్యేక గీతంలో కూడా నర్తించేందుకు అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే భన్సాలీతో ప్రియాంక చోప్రాకు ఇది మూడవ అవకాశం. బాజీరావ్ మస్తానీ, గోలియోం కి రాస్లీలా రామ్ లీలా వంటి భారీ కళాఖండాల్లో పీసీ అవకాశం అందుకుంది. ఇప్పుడు భన్సాలీతో `లవ్ అండ్ వార్` హ్యాట్రిక్ మూవీ అవుతుంది. అయితే దీనిని దర్శకనిర్మాత భన్సాలీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. లవ్ అండ్ వార్ చిత్రంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ తదితరులు నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా చేరికతో మరింత క్రేజ్ పెరగనుంది.