హైదరాబాద్ లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. స్వరమాంత్రికుడు, ఆస్కార్ గ్రహీత రెహమాన్ కి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టే నవంబర్ లో జరగనున్న లైవ్ కాన్సెర్టు టికెట్ల కోసం జనం ఎగబడుతున్నారు. టికెట్ ధరతో సంబంధం లేకుండా ఆన్ లైన్ లో బుకింగులు హోరెత్తుతున్నాయని సమాచారం. జూలై 14 నుంచి టికెట్లు అందుబాటులోకి రావడంతో భారీగా బుకింగులు జరుగుతున్నాయి.
టికెట్ ధరల వివరాల్లోకి వెళితే... స్టాండింగ్ గోల్డ్ క్లాస్ టికెట్ ఖరీదు రూ.1800 కాగా, ఎంఐపి కపుల్ టికెట్ ఖరీదు రూ.13,000. ఫేజ్ 3లో కూచుని దగ్గరగా రెహమాన్ షో చూడాలంటే ఏకంగా రూ.24,000/- ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫ్యాన్ ఫిట్ సెక్షన్ లో కూచుని షోని వీక్షించాలంటే రూ.5,500 లేదా 10,000/- ఖర్చవుతుంది. ప్లాటినం చైర్ -రూ.4000 రేంజులో అందుబాటులో ఉంది. అయితే ఈ ధరలు చూడగానే సామాన్యుడు నోరెళ్లబెడుతున్నాడు. సంగీత ప్రపంచంలో రెహమాన్ లెజెండ్.
ఆయన స్థాయికి ఈ రేంజు ధరలు సాధారణం అనేవారు లేకపోలేదు. ది వండర్‌మెంట్ టూర్ -2025 పేరుతో నవంబర్ 8న ఈవెంట్ జరగనుంది. నిర్వాహకులు భారీగా వేడుకను ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని ఓ భారీ స్టేడియంలో ఈ లైవ్ కాన్సెర్ట్ జరగనుంది. ఈ కాన్సెర్టులో చరణ్ పెద్ది సినిమా నుంచి ఎక్స్ క్లూజివ్ పాటను రెహమాన్ పాడే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.