భారతదేశంలో ఎందరో పేరున్న దర్శకులు ఉన్నారు. అవార్డ్ ఫిలింమేకింగ్ లో తలలు పండిన దిగ్గజాలు ఉన్నారు. కమర్షియల్ గా కాసులు కురిపించకపోయినా కానీ, అవార్డులు రివార్డుల కోసం మాత్రమే సినిమాలు తీసే దర్శకులు ఉన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే వాళ్లలోను అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసే సత్తా ఉన్నవాళ్లు ఉన్నారు.
అయితే ఎంతమంది దర్శకులు ఉన్నా కానీ, భారతదేశంలో ఆస్కార్ విన్ అయ్యే సత్తా ఉన్న దర్శకుడు ఒక్క రాజ్ కుమార్ హిరాణీ మాత్రమేనని అభిప్రాయపడ్డారు బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా. ఆయన రాజు హిరాణీతో కలిసి పీకే, సంజు సహా పలు విజయంతమైన చిత్రాలకు పని చేసారు. హిరాణీని అతడు చాలా క్లోజ్ గా పరిశీలించారు. హిరాణీలోని నిబద్ధత, ఫిలింమేకింగ్ టెక్నిక్స్, అపారమైన విజ్ఞానంపై వందశాతం నమ్మకాన్ని వ్యక్తపరిచారు ముఖేష్ చాబ్రా. ఆయన సామాజిక అంశాలను స్పృశించగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్ కి కనెక్ట్ చేసే కథాంశాలను అందించగలరు. సున్నితమైన భావోద్వేగాలు, సరసమైన సన్నివేశాలు, హాస్యం, వ్యంగ్య కథలతో మెప్పింగలరని చాబ్రా అన్నారు. ముఖ్యంగా ఎమోషనల్ డెప్త్, ప్రపంచవ్యాప్త భావోద్వేగాలను కనెక్ట్ చేయగల సామర్థ్యం ఆయనకు ఉందని అభిప్రాయపడ్డారు.
ఆర్.ఆర్.ఆర్ `నాటు నాటు`తో భారతదేశానికి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ని అందించగలిగారు రాజమౌళి. అయితే టాలీవుడ్ నుంచి రాజమౌళి, సుకుమార్ సహా పలువురు దర్శకులు అవార్డులు తెచ్చే సినిమాలను తీయగలరు. కానీ వారంతా కమర్షియల్ గా నిర్మాతను సేఫ్ జోన్ లో ఉంచడం కోసం ఆలోచిస్తారనేది అందరికీ తెలిసిన నిజం. ఇక ఉత్తమ దర్శకుడుగా ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. విదేశీ కేటగిరీలో భారతీయ సినిమా నిలదొక్కుకోవాలంటే ఆర్.ఆర్ఆర్ తరహా ప్రమోషనల్ స్ట్రాటజీని అనుసరించాలి. దీనికోసం వందల కోట్లు ఖర్చు చేసారనేది మరువకూడదు.