సౌందర్య తర్వాత మళ్లీ అంత గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది నిత్యా మీనన్. ఈ రింగుల జుత్తు సుందరి తనదైన అందం, నట ప్రతిభతో హృదయాలను గెలుచుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంలో నిత్యా విజయవంతమైన కెరీర్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే దాదాపు 70 సినిమాల్లో నటించింది. అయితే వయసు 35 బార్డర్ క్రాస్ చేసినా కానీ ఇంకా ఒంటరిగానే ఉండిపోయింది ఈ మలయాళీ బ్యూటీ. అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు.
అయితే తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి కారణాలను తాజా ఇంటర్వ్యూలో నిత్యా చెప్పుకొచ్చింది. తాను ఇప్పటికి నాలుగుసార్లు పెళ్లికి దగ్గరగా వచ్చి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నానని పేర్కొంది. ప్రేమలో బ్రేకప్ లు ఉన్నాయని, హృదయవిదారకమైన ఘర్షణల్ని చూసానని నిత్యా తెలిపింది. ప్రతి ఒక్కరూ దోపిడీ చేస్తున్నారని తెలిసి విరక్తి పుట్టిందని అన్నారు. అసలు ప్రేమ ఉందో లేదో తెలియని ప్రపంచమిది అని కూడా నిత్యా నిందించారు. తను పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని ఇంట్లో తల్లిదండ్రులు, దివంగత అమ్మమ్మ బలంగా కోరుకున్నారు. కానీ వ్యక్తులలో సరైన ప్రేమను కనుగొనలేకపోయానని, అందుకే పెళ్లికి దూరంగా ఉన్నానని నిత్యా తెలిపింది. అలాగే సమాజం కోసం తాను పెళ్లి చేసుకునే దశను దాటిపోయానని కూడా నిత్యా అంది. పెళ్లికి ఇప్పుడు అంత ప్రాముఖ్యత లేదని మాట్లాడింది. అయితే ఒంటరి జీవితం అసంపూర్ణ జీవితమేనని అంగీకరిస్తానని నిత్యా తెలిపింది.
అంతేకాదు.. పారిశ్రామిక వేత్త రతన్ టాటా గురించి ప్రస్థావిస్తూ.. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు. శృంగార సంబంధాలతో పని లేకుండా టాటా లాంటి ప్రముఖుడు సంతోషంగా ఉన్నారని, తాను కూడా అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని కూడా నిత్యా అంది. అయితే నిత్యా మీనన్ కెరీర్ పీక్స్ లో ఉండగానే అప్పటికే పెళ్లయిన హీరోలతో ఎఫైర్ సాగించిందని మీడియాలో కథనాలొచ్చాయి. చివరికి నిత్యా పెళ్లి టాపిక్ ని విడిచిపెట్టి ఒంటరి జీవితానికే అంకితమయ్యానని చెప్పడం మరోసారి మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.