పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పబ్లిక్ లోకి వెళుతూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. అయితే గత ప్రభుత్వ పాలనలో పవన్ జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతున్న క్రమంలోనే ఆయనపై చాలా రాజకీయ కుట్రలు జరిగాయి. ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం పవన్ ని చాలా కోణాల్లో ఇబ్బందులకు గురి చేసింది. పవన్ ని రాజకీయంగా తొక్కాలంటే ఆర్థికంగా దెబ్బ కొట్టాలని వైసీపీ ప్లాన్ చేసింది.
అప్పట్లో పవన్ సినిమా టికెట్ ధరలను రూ.10 కు తగ్గించడం సంచలనంగా మారింది. నిర్మాతలు అతడితో సినిమా చేయాలంటే భయపడే పరిస్థితి తలెత్తింది. వకీల్ సాబ్ పేరుతో జాక్ పాట్ దిల్ రాజు- బోనీకపూర్ వంటి నిర్మాతలను కూడా వరించింది. ఇక జగన్ ప్రభుత్వ నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది. పవన్ పై ఇది రాజకీయ కుట్ర అని సామాన్య ప్రజలకు కూడా అవగతమైంది.
ఇప్పుడు ఈ కుట్రలన్నిటి గురించి పవన్ సూటిగా, బహిరంగంగా స్పందించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళవారం నాడు మీడియాతో ముచ్చటించిన పవన్ తనపై గత ప్రభుత్వం చేసిన కుట్రల గురించి మాట్లాడారు. తన సినిమాకి రూ.10, రూ.15 కే టికెట్ ధరను గత ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు. తనను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసారని, విశాఖలోని ఓ హోటల్ లో తనను నిర్భంధించడం కీలక పరిణామమని కూడా తాజా ఇంటర్వ్యూలో పవన్ వ్యాఖ్యానించారు. నాపై రాజకీయ కక్షలు కుట్రల కారణంగా నా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారని కూడా పవన్ అన్నారు.
ఇప్పుడు వీరమల్లు ప్రచారానికి సహకరించడం తన బాధ్యత అని అన్నారు. వీరమల్లు చాలా కారణాలతో ఆలస్యమైంది. కరోనా క్రైసిస్ సహా రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కారణంగాను ఇది ఆలస్యమైందని పవన్ తెలిపారు. సీమలో కక్షల కారణంగా చినీ చెట్లను నరికి, ప్రత్యర్థిని ఆర్థికంగా దెబ్బ తీయాలనుకునే మనస్తత్వం ఉన్న కొందరు, తనను కూడా రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ తీయాలని ప్రయత్నించారని పవన్ వ్యాఖ్యానించారు. తన సినిమాలకు తాను అండగా నిలబడతానని తెలిపారు.