2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీని నామ రూపాల్లేకుండా చేసి కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఆ తర్వాత కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. అప్పటినుంచి టీడీపీ-జనసేన పార్టీలు కలిసి కట్టుగా పని చేస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి మెలిసి ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
ఇక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ప్రజలను చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల పేరుతొ మాయ చేసారంటూ గొంతెత్తుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంగా తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అయితే ఆ సూపర్ సిక్స్ పథకంలో ఒక పథకాన్ని నెరవేరిస్తే రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ ఏపీ మినిస్టర్ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
విజయనగరంలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు సూపర్ సిక్స్ లో అన్ని పథకాల అమలు జరుగుతున్నాయని ఒక్క పథకమే పెండింగ్ లో ఉందని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలకు రూ.1500 ఇచ్చే పథకం గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు రూ.1500 ఇచ్చే పథకం అమలు చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
దాంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి ఏపీ మహిళలను కూటమి ప్రభత్వం మోసం చేసింది అంటూ రాగమందుకుంటున్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యల ఫలితం కూటమి ప్రభుత్వం జుట్టు వైసీపీ నేత జగన్ చేతిలోకి వెళ్ళింది. ఇకపై జగన్, వైసీపీ నేతలు కలిసి అచ్చెన్నాయుడు కామెంట్స్ ను వైరల్ చెయ్యడమే పనిగా పెట్టుకుంటే ప్రజల్లోకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా సంకేతాలు వెళతాయి. అది కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ బెల్స్ మోగినట్లే కదా.!