అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ కొన్ని నెలల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతడికి కర్నాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం ని ఆశ్రయించగా, విచారణలో సుప్రీం న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేసారు. దర్శన్ కు బెయిల్ ఇవ్వడంలో హైకోర్టు విచక్షణను సరిగా ఉపయోగించలేదని సుప్రీం వ్యాఖ్యానించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా దర్శన్ లాయర్, సీనియర్ న్యాయవాది సిబల్ ని కూడా న్యాయమూర్తులు కోరారు. విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసింది.
తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్ లు పంపిన కారణంగా అభిమాని రేణుకాస్వామిని కొందరు దుండగుల సాయంతో హింసించిన దర్శన్, అతడు మరణించడంతో మృతదేహాన్ని కాలువలో పడేసిన ఘటన సంచలనమైంది.
ఆ తర్వాత ఈ కేసులో పవిత్ర, దర్శన్ సహా ఇతర నిందితులను అరెస్ట్ చేయగా, దర్శన్ కొన్ని నెలల క్రితం బెయిల్ పై బయటకు వచ్చారు. తిరిగి స్వేచ్ఛగా అతడు సినిమాల్లో నటిస్తున్నారు. సుప్రీం తాజా వ్యాఖ్యలతో మరోసారి నెటిజనుల్లో చర్చ మొదలైంది.