బాలీవుడ్ లో బుల్లితెరపై బిజీ బిజీగా గడిపేస్తోంది ఎల్లీ అవ్ రామ్. పలు రియాలిటీ షోలకు చాలా కాలంగా జడ్జిగా కొనసాగుతోంది. ఈ విదేశీ భామ గతంలో క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో డేటింగ్ కారణంగా నిరంతరం వార్తల్లో నిలిచింది. కానీ ఇటీవల ఎల్లీ అవ్ రామ్ డేటింగ్ లైఫ్ కి దూరంగానే కనిపించింది. నటన- కెరీర్ పైనే ఫోకస్ చేస్తోంది.
ఇప్పుడు ఉన్నట్టుండి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఆశిష్ చంచలానీతో డేటింగ్ చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇంతకుముందు అతడు ఎల్లీతో డేట్ చేస్తున్నానంటూ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ జోడీ ఒక ఫన్నీ వీడియోని షేర్ చేయగా అది ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అవుతోంది. ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఒక రేంజులో వర్కవుటైంది ఈ వీడియోలో. అతడి సరదా పరాచికాలకు మైమరిచి నవ్వేస్తోంది ఎల్లీ అవ్ రామ్. ఆమెకు స్పాట్ బాయ్ ని అంటూ పరిచయం చేసుకున్న ఆశిష్ తన దుస్తులను సరిచేస్తూ కనిపించాడు. చివరికి మిమ్మల్ని ``వంతెన పైనుంచి నెట్టేయవచ్చా మేడమ్?`` అంటూ ఫన్ కురిపించాడు.
ఎల్లీ అందమైన నవ్వులతో అతడి సరసన రొమాంటిగ్గా కనిపించింది. ప్రస్తుతం నెటిజనులు హుషారుగా ఈ జంటపై కామెంట్లు చేస్తున్నారు. అందమైన జంట పెళ్లి తేదీ చెబితే బావుంటుంది! అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ఆశిష్ చంచలానీ దర్శకరచయితగా క్రియేట్ చేసిన ఏకాకి షో యూట్యూబ్ లో విడుదల కానుంది. మిక్కీ వైరస్, కిస్ కిస్కో ప్యార్ కరూన్, నామ్ షబానా, గుడ్‌బై సహా పలు చిత్రాల్లో ఎల్లీ అవ్ రామ్ నటించింది. ఇటీవల అభిషేక్ బచ్చన్ బీ హ్యాపీ అనే చిత్రంలో ఎల్లీ అతిథి పాత్రలో మెరిసింది. తదుపరి పలు నిర్మాణ సంస్థలతో మంతనాలు సాగిస్తోందని సమాచారం.