చాలామంది ఆన్ లైన్ లో మోసపోతున్నా కానీ.. ఆన్ లైన్ లో వస్తువులను ఆర్డర్ పెట్టడం మానరు. ఇంట్లో కూర్చుని హాయిగా ఆన్ లైన్ లో బట్టలు దగ్గర నుంచి బుక్స్ వరకు, ఫుడ్ దగ్గర నుంచి పిన్నీస్ వరకు, మేకప్ కిట్స్ దగ్గర నుంచి చీరకట్టే బ్యూటీషియన్ వరకు ఆర్డర్స్ పెట్టడమే అన్నట్టుగా తయారయ్యారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అలిసిపోయి ఖాళీ లేక ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతున్నారు అనుకోవడానికి లేదు, చిన్నవాళ్లు, పెద్దవాళ్ళు, డబ్బులున్నోళ్లు, పల్లెటూరు వాళ్ళు అందరూ ఆన్ లైన్ లో వస్తువులు తెప్పించేందుకు అలవాటుపడిపోయారు.
ఇలాంటి ఆన్ లైన్ బిజినెస్ లోను బోలేడన్ని మోసాలు వెలుగులోకి వస్తున్నా.. చాలామంది ఆ ఆన్ లైన్ ఆర్డర్ రోగాన్ని మాత్రం వదలడమే లేదు. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ అనసూయ ఆన్ లైన్ లో కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టగా అవి ఇంతవరకు తనకు రాలేదు, ఆన్ లైన్ ఆర్డర్ తో మోసపోయాను అంటూ సోషల్ మీడియాలో వాపోయింది.
కొద్దిరోజుల క్రితం ట్రిపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో తనకు కావాల్సిన బట్టలను అనసూయ ఆర్డర్ చేయడమే కాదు, ముందే క్యాష్ ఆన్ లైన్ లో పే చేసేసిందట. బట్టలు ఆర్డర్ పెట్టి నెలరోజులు పైనే గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంటికి బట్టలు రాకపోగా.. ఆ కంపెనీ తనకు రీఫండ్ కూడా చేయలేదని అనసూయ చెప్పుకొచ్చింది.
ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ తనలా మోసపోవద్దు అంటూ అనసూయ సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఆన్ లైన్ మోసాన్ని బయటపెట్టింది.