వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రస్తుత టీడీపీ ఎమ్యెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలే కాదు, మహిళలు కూడా నల్లపరెడ్డిపై ఫైరవుతున్నారు. తన వదిన అయిన ప్రశాంతి రెడ్డిని నల్లపు రెడ్డి అన్నేసి మాటలనడం, దానిని వైసీపీ అధ్యక్షుడు జగన్ చూస్తూ ఊరుకోవడం పై పెద్ద దుమారమే చెలరేగింది.
తాజాగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు, ఆయనపై పవన్ నిప్పులు చెరిగారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ, వ్యక్తిగతంగా దూషిస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, అలాంటి మాటల వలన సభ్య సమాజం తలదించుకుంటుంది అన్నారు.
రాజకీయనాయకుల మద్యన ఆరోగ్యకర పోటీ ఉండాలి కానీ.. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అంతేకాదు మహిళలను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోమని, వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.