చప్పగా సినిమా తీస్తే థియేటర్లలో చూడటానికి ఈరోజుల్లో ఎవరూ సిద్ధంగా లేరు. ప్రజలు చాలా తెలివి మీరి పోయారు. పాత చింతకాయ కథలు, రొటీన్ సినిమాలు తీస్తే వాటికి పట్టించుకునేవాళ్లే లేరు. ముఖ్యంగా విజువల్ గ్రాండియారిటీ లేనిదే జనాలకు కిక్కు ఎక్కడం లేదు. కంటెంట్ పరంగా అసాధారణంగా ఏదైనా ఉంటేనే థియేటర్ కి వచ్చి చూడాలనుకుంటున్నారు. అవతార్, సూపర్ మేన్, బ్లాక్ పాంథర్, ట్రాన్స్, ప్రిడేటర్స్, మిషన్ ఇంపాజిబుల్, అవెంజర్స్ ఈ రేంజులో ఉంటేనే దానిని సినిమా అని పిలుస్తున్నారు.
ఏది ఏదైనా కానీ, ఇటీవలి కాలంలో భారతదేశంలోని థియేటర్లలో బంపర్ హిట్లు కొట్టినవి హాలీవుడ్ సినిమాలు మాత్రమే. ఫైనల్ డెస్టినేషన్, జురాసిక్ వరల్డ్ - రీబర్త్, ఫార్ములా వన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సౌండ్ చేసాయి. రీసెంట్ గా రిలీజైన జురాసిక్ వరల్డ్ రీబర్త్ భారతదేశంలో నాలుగు రోజుల్లో 45 కోట్లు కొల్లగొట్టిందంటే హవా ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. బ్రాడ్ పిట్ నటించిన ఫార్ములా వన్ రెండు వారాల తర్వాత థియేటర్లలో ఆడుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. దీని అర్థం ఇండియాలో తయారైన సినిమాలను మించి జనం హాలీవుడ్ కి అడిక్ట్ అయ్యారని భావించాల్సి వస్తోంది.
రెండు వారాలుగా లోకల్ మేడ్ సినిమాలు ప్రజలకు ఏమంత రుచించలేదు. శేఖర్ కమ్ముల - కుబేర కేవలం తెలుగు ఆడియెన్ కి మాత్రమే నచ్చింది. దేశంలో ఇంకెక్కడా ఆడలేదు. ఈ సినిమాకి అటూ ఇటూగా వచ్చిన సినిమాలేవీ అంతగా ఆదరణ పొందలేదు. మంచు విష్ణు కన్నప్ప, నితిన్ - తమ్ముడు నిరాశపరిచాయి. మునుముందు హాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇవన్నీ ఇప్పటికే భారతదేశంలో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఫ్రాంఛైజీ చిత్రాలు. మార్వల్ స్టూడియోస్, డీసీ నుంచి అత్యంత భారీ బడ్జెట్లతో రూపొందినవి. ఈ కేటగిరీలో ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్, ట్రాన్ - ఏరెస్ (అక్టోబర్), ది రన్నింగ్ మేన్ (నవంబర్), ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ (నవంబర్ 7న) విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఫెంటాస్టిక్ ఫోర్ నుంచి కొత్త సినిమా ఈనెలాఖరున విడుదల కానుంది. భారతదేశం నుంచి 100 కోట్లు అంతకుమించి వసూలు చేయడంలో హాలీవుడ్ సినిమాలు సక్సెసవుతున్నాయి.