కొన్ని నెలల క్రితం దుబాయ్ నుంచి భారతదేశానికి అక్రమంగా బంగారం రవాణా చేసిన కన్నడ నటి రన్యారావును పోలీసులు, డిఆర్ఐ అధికారులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలా మెలోడ్రామా తర్వాత రన్యా అధికారులకు చిక్కింది. ఆ సమయంలో రన్యారావుతో 14 కేజీల బంగారం కడ్డీలు పట్టుబడ్డాయి. దీని విలువ సుమారు 13 కోట్లు. అంతకుముందు కూడా రన్యారావు పలుమార్లు విమానాశ్రయ అధికారుల కళ్లుగప్పి బంగారం స్మగ్లింగ్ చేసినట్టు డిఆర్ఐ ఆరోపించింది. ఈ కేసులో హవాలా మార్గాల్లో డబ్బు విదేశాలకు చేరడంపైనా ఈడీ అధికారులు దర్యాప్తు చేసారు. స్మగ్లింగ్ లో భాగంగా రన్యా పలుమార్లు దుబాయ్ సహా విదేశాలకు వెళ్లిందని అధికారులు ధృవీకరించారు.
ఈకేసులో తాజా పరిణామంలో రన్యారావుకు చెందిన 34.12 కోట్ల ఆస్తిని ఈడీ దర్యాప్తు చేసింది. బెంగళూరులోని ఒక భారీ భవంతి (సొంత ఇల్లు), ఓ నివాస స్థలం, వ్యవసాయ భూమి, పారిశ్రామిక భూమి కూడా ఇందులో ఉన్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఏ) కింద ప్రస్తుతం అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.
సీబీఐ, డిఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు ఫెడరల్ సంస్థ ఈ కేసును డీల్ చేస్తోంది. రన్యారావు అండ్ కో బంగారం అక్రమ రవాణా కోసం ఎలాంటి స్కెచ్ లు వేసారు? అన్నది అధికారులు విచారించారు. ఈ విచారణలో తెలిసిన నిజాలు విస్తుబోయేలా చేసాయని కథనాలొచ్చాయి. రన్యారావుకు ఇప్పటికీ ఈ కేసులో బెయిల్ రాలేదు.