భారతదేశంలోని సుదీర్ఘ అనుభవం ఉన్న నటుల్లో మోహన్ లాల్ ఒకరు. మాలీవుడ్ ఐకాన్ గా ఆయన సుప్రసిద్ధులు. 60 ప్లస్ వయసులోను వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు లాల్. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటవారసుడు ప్రణవ్ లాల్ కూడా హీరో అయ్యాడు. కానీ అతడు సెలక్టివ్ గా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించాడు. ఇప్పుడు లాల్ లెగసీని ముందుకు నడిపించే వాళ్లు అవసరం.
తాజా సమాచారం మేరకు మోహన్ లాల్ కుమార్తె విస్మయ మలయాళ చిత్రసీమలో తొలి అడుగులు వేస్తోంది. జుడ్ ఆంథనీ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్న `తుడక్కం`లో విస్మయ నటించేందుకు సిద్ధమవుతోంది.
విస్మయకు రచనలో అనుభవం ఉంది. కానీ నటిగా ఇదే మొదటి ప్రయత్నం. తన సోదరి సినీప్రపంచంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రణవ్ లాల్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక అభిమానులు విస్మయ నటిగా నిరూపించుకోవాలని, తండ్రి అడుగు జాడల్లో నడవాలని ఆకాంక్షిస్తున్నారు