కొన్నాళ్లుగా సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నాలుగు కాదు కాదు మూడువారాలకే ఓటీటీ ల నుంచి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసున్నాయి. భారీ బడ్జెట్ అయినా, లేదంటే మీడియం రేంజ్ అయినా, చిన్న సినిమాలైనా ఏదైనా సరే థియేటర్స్ కి ఓటీటీ కి కేవలం నాలుగు వారాలు మాత్రమే గ్యాప్ ఉంటుంది. దానితో థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకులు కరువైపోతున్నారు.
బ్లాక్ బస్టర్, లేదంటే హిట్ టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్స్ కి కదలడం లేదు. దానితో థియేటర్స్ కన్నా ఎక్కువగా ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోయింది. థియేటర్స్ కి రాని జనాలు ఓటీటీలో ఎక్కడున్నా ఆ సినిమాలను వెతికి మరీ వీక్షించేస్తున్నారు. అలా ఓటీటీ వ్యవస్థ బలపడిపోయింది. థియేటర్ రంగం ఓటీటీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడొక బాలీవుడ్ హీరో ఓటీటీలకు షాకివ్వబోతున్నారు.
ఆయనెవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, ఆమిర్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సితారే జమీన్ పర్ కి ఓటీటీ నుంచి 100 కోట్ల ఆఫర్ వచ్చినా తిరస్కరించి మరీ ఆ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన తర్వాత, నేరుగా యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
థియేటర్లలోకి విడుదలైన ఎనిమిది వారాల తర్వాత దీన్ని నేరుగా యూట్యూబ్‌లోకి తీసుకురానున్నారట. పే-పర్-వ్యూ పద్దతిలో ఇది ప్రేక్షకులకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ ఓటీటీని వదిలేసి ఆమిర్ యుట్యూబ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.