ప్రస్తుతం కంకిపాడు పోలీస్ స్టేషన్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ కి కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ.. మరికొన్ని కేసులు వంశీ మెడకు చుట్టుకోవడంతో ఆయన ఇంకా జైలు జీవితాన్నే గడుపుతున్నారు. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దానితో వంశీ ని పోలీస్ లు కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. వంశీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా మరో వైసీపీ నేత పేర్ని నాని కూడా వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వంశీకి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. దానితో హుటాహుటిన కంకిపాడు పోలీసులు ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.