అతడు భారతదేశంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటుడు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. స్టార్ హీరోగా ఇండస్ట్రీలో సత్తా చాటాడు. ప్రస్తుతం దక్షిణాది సినీపరిశ్రమలో సహాయక పాత్రలు, విలన్ పాత్రలు చేస్తున్నాడు. కానీ తన కుమారుడిపై జరుగుతున్న కుట్రల విషయంలో చాలా కలతకు గురయ్యాడు.
వారంతా తన కొడుకును లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తుంటే భగభగ మరిగిపోతున్నాడు. అసలు ఈ కుట్రలు చేస్తున్నది ఎవరో నేను బయటపెడతాను! అంటూ సీరియస్ అయ్యాడు. అయితే ఇండస్ట్రీలో ఎంతో డీసెన్సీ ఉన్న హీరోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరిచింది. కుమారుడి కెరీర్ కళ్ల ముందే నాశనమవుతుంటే ఆక్రోశం తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నాడా? అని అందరూ భావిస్తున్నారు. ఈ వెటరన్ హీరో మరెవరో కాదు.. సునీల్ శెట్టి.. బాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకడు.
తన కుమారుడు అహన్ శెట్టి కెరీర్ లో ఫ్లాపులు ఎదుర్కొన్నా, నెమ్మదిగా ఇండస్ట్రీపై పట్టు సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం సన్నీడియోల్ `బార్డర్ 2`లో అవకాశం అందుకున్నాడు. కానీ అతడు వేరొక సినిమాని కాదన్నాడని అతడిపై దుష్ప్రచారం చేసారని సునీల్ శెట్టి సీరియస్ అయ్యారు. తన కొడుకును టార్గెట్ చేసింది ఎవరో తానే బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఒక సీనియర్ హీరో ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. స్టార్ హీరో వారసుడిపై కుట్రలు చేసింది ఎవరో తేలాల్సి ఉంది.