రెండు దశాబ్దాలకు పైగా హోస్ట్‌గా ఏలిన బిగ్ బి వ్యక్తిగత కారణాల వల్ల `కౌన్ బనేగా కరోడ్‌పతి`(కేబీసీ) నుండి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలు కథనం ప్రచురించాయి. అమితాబ్ బచ్చన్ - KBC ఒకదానితో ఒకటి ముడిపడిన పదాలు.. ఇవి ఒకదానికొకటి పర్యాయపదాలు.. సోనీ టెలివిజన్‌లో పాపులర్ రియాలిటీ షోను అమితాబ్ కాకుండా వేరొకరు హోస్ట్ చేస్తున్నారనే వాస్తవాన్ని దేశీ టీవీ ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందనడంలో సందేహం లేదు.
షారూఖ్ ఖాన్‌ను కూడా KBC ఒక సీజన్‌కు హోస్ట్‌గా నియమించారు కానీ అమితాబ్ బచ్చన్ రేంజులో స్పందనను పొందలేకపోయారు. అయితే సల్మాన్ ఖాన్ విషయంలో సంగతులు వేరు. ఇప్పటికే బుల్లితెరపై విపరీతమైన ప్రజాదరణ పొందిన అతి కొద్ది మంది బాలీవుడ్ నటులలో సల్మాన్ భాయ్ ఒకరు. అందువల్ల కేబీసీని అతడు సమర్థవంతంగా నడిపించగలడని నమ్ముతున్నారు.
గోవింద, షారుఖ్ వంటి చాలా మంది సూపర్‌స్టార్‌లు బుల్లితెరపై హోస్ట్‌లుగా రాణించలేకపోయినా కానీ, సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చాలా ప్రజాదరణ పొందాడు. దస్ కా దమ్, బిగ్ బాస్ అనే రెండు పెద్ద రియాలిటీ షోలను తన స్టార్‌డమ్‌తో విజయవంతంగా నడిపించాడు. ఈ షోలకు సల్మాన్ యాంకర్‌గా ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అందుకే కౌన్ బనేగా కరోడ్‌పతిలో అమితాబ్ బచ్చన్‌కు ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. సల్మాన్ హోస్టింగ్ చేస్తారా లేదా? అన్నది షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ తదుపరి సీజన్ కు హోస్ట్ గా తిరిగి వస్తాడనే నమ్ముతున్నారు ఇప్పటికి. జూలైలో అపూర్వ లఖియాతో కొత్త సినిమాను కూడా సల్మాన్ ప్రారంభిస్తున్నాడు.